Hathras Stampede:హత్రాస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్

యూపీ హత్రాస్‌ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గతేడాది 121 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2025-02-21 12:46 GMT

హత్రాస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్

Hathras Stampede: యూపీ హత్రాస్‌ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గతేడాది 121 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాట సంఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరుకావడం వల్ల తొక్కిసలాటలో ఊపిరాడని కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికల్లో పేర్కొన్నట్టు సమాచారం.

హత్రాస్ తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ భవేష్ కుమార్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ హేమంత్ రావులను కమిషన్ సభ్యులుగా నియమించారు. తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని కమిషన్ తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. ఏదైన పెద్ద కార్యక్రమానికి ముందు, పోలీసు అధికారులు స్వయంగా వేదికను తనిఖీ చేయడం తప్పనిసరి అని తెలిపింది. గతంలో ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సైతం ఈ ఘటనలో భోలే బాబా ప్రమేయం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.

2024 జులై 2వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. జనసమూహ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హాత్రాస్ జిల్లా సికింద్రరావ్ ప్రాంతంలో పుల్ రయీ, ముగల్‌గఢీ గ్రామాల మధ్యలోని రహదారిని ఆనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి 80 వేల మంది భక్తులు హాజరవుతారని భావించిన నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షల పైగా ప్రజలు హాజరయ్యారు. సత్సంగ్‌లో ప్రవచనాలు బోధించిన భోలే బాబా పాద ధూళి కోసం భక్తులు ఒక్కసారిగా వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాటలో చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇక భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ జాటవ్. ఆయనను నారాయణ్ సాకార్ హరి అని కూడా పిలుస్తుంటారు. ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్ అయిన సూరజ్ పాల్ జాటవ్ ఉద్యోగాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు.

Tags:    

Similar News