ఉదయ్‌పూర్‌లో ముగిసిన చింతన్ శివిర్

*కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భారత్‌ జోడో యాత్ర

Update: 2022-05-16 01:02 GMT

ఉదయ్‌పూర్‌లో ముగిసిన చింతన్ శివిర్ 

Congress: గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2 నుంచి దేశ వ్యాప్త యాత్రను ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 'భారత్‌ జోడో యాత్ర' నిర్వహిస్తామని చెప్పారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజుల చింతన్ శివిర్ ఆదివారంతో ముగిసింది. చివరి రోజున పార్టీ బలోపేతం కోసం పలు కీలక నిర్ణయాలను సోనియా గాంధీ ప్రకటించారు. ఒత్తిడిలో ఉన్న సామాజిక సామరస్య బంధాలను బలోపేతం చేయడానికి, దాడికి గురవుతున్న రాజ్యాంగం విలువలను పరిరక్షించడానికి, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తి చూపడానికి అక్టోబర్‌ 2 నుంచి 'భారత్‌ జోడో యాత్ర'ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సంస్కరణల కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ తెలిపారు. అలాగే రాజకీయ సమస్యలను చర్చించడానికి సీడబ్ల్యూసీకి చెందిన ఒక సలహా బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతుందని చెప్పారు. మనం అన్నింటిని అధిగమిస్తాం అని పార్టీ నేతల్లో జోష్‌ నింపేందుకు సోనియా ప్రయత్నించారు. సామూహిక ప్రయోజనం కోసం మనం నిస్సందేహంగా స్ఫూర్తి, శక్తిని తిరిగి పొందుతామని అన్నారు. మరోవైపు చింతన్‌ శివిర్‌ చివరి రోజైన ఆదివారం నవ్ సంకల్ప్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. త్వరలో జరుగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న లోక్‌సభ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేందుకు పార్టీలో విస్తృత సంస్కరణల కోసం రోడ్ మ్యాప్‌ను ప్రకటించింది. ఒకే టికెట్, ఒకే వ్యక్తికి ఒకే పదవి అంశాన్ని కీలకంగా పేర్కొంది. పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలికి పేపర్ బ్యాలెట్ తీసుకువచ్చేందుకు ఆమోదం తెలిపింది.

సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఏ విషయంపై అయినా అంతర్గత చర్చ ఉంటుందన్నారు. ఇతర పార్టీల్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. BJP, RSSలలో ఇంత స్వేచ్ఛగా చర్చించుకునే అవకాశమే లేదన్నారు. ప్రధాని మోదీ ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మమేకమైతేనే పార్టీకి పునర్ వైభవం సాధ్యమని తేల్చిచెప్పారు. అక్టోబర్ నుంచి నాయకులంతా యాత్రలు చేసి ప్రజల సమస్యలపై పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు.  

Tags:    

Similar News