బెంగుళూరులో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు.. 133 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
బెంగుళూరులో భారీ వర్షం కురిసింది. 133 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు బెంగుళూరులో 111 మి.మి. వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ ప్రకటించింది.
బెంగుళూరులో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు.. 133 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
Bengaluru: బెంగుళూరులో భారీ వర్షం కురిసింది. 133 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు బెంగుళూరులో 111 మి.మి. వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ ప్రకటించింది.
తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో కొన్ని రోజులుగా బెంగుళూరు వాసులు బిందెడు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు బెంగుళూరు వాసుల నీటి కష్టాలను తీరుస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 1891 జూన్ 16న ఒక్కరోజులోనే బెంగుళూరులో 101.6 మి.మి.వర్షపాతం నమోదైంది. ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ కాలేదు. కానీ, నైరుతి రుతుపవనాల ప్రవేశంతో బెంగుళూరులో ఆదివారం రాత్రి వరకు ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. జూన్ లో బెంగుళూరులో సాధారణ వర్షపాతం 110.3 మి.మి.నమోదౌతుంది. అయితే గత రెండు రోజులుగా బెంగుళూరులో 120 మి.మి. వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.
కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ఆఫ్ ది రెవిన్యూ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ శాఖ రిపోర్ట్ మేరకు బెంగుళూరు హంపినగర్ లో 110.50 మి.మి. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మారుతి మందిర వార్డులో 89.50 మి.మి. వర్షపాతం రికార్డైంది. విద్యాపీఠలో 88.50 మి.మి., కొట్టొన్ పేటలో 87.50 మి.మి. వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇవాళ కూడా బెంగుళూరులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు చోట్ల చెట్లు విరిగాయి. దీంతో వాహనాలు, ఇళ‌్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడిన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్దరించలేదు.
బెంగుళూరు-మైసూరు రోడ్డులో వరద నీరు చేరింది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల తర్వాత నగరానికి తిరిగి వస్తున్న వాహనదారులకు రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గంలో కనీసం 3 కి.మీ. వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.