TOP 6 NEWS @ 6PM :వివేకా కేసులో రంగన్న మృతిపై ఏపీ కేబినెట్‌లో చర్చ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు.
1.వైఎస్ వివేకా హత్య కేసు సాక్షి రంగన్న మృతిపై ఏపీ కేబినెట్ లో చర్చ
1.వైఎస్ వివేకా హత్య కేసు సాక్షి రంగన్న మృతిపై ఏపీ కేబినెట్ లో చర్చ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను మంత్రులకు డీజీపీ వివరించారు. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలానే చనిపోయారని సీఎం గుర్తు చేశారు. రంగన్న మరణం అనుమానాస్పదమని సీఎం అభిప్రాయపడ్డారు.
2.సముద్రంలో నాలుగు పడవల బోల్తా: 186 మంది గల్లంతు
వలసదారులతో వెళ్తున్న నాలుగు పడవలు సముద్రంలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 186 మంది గల్లంతయ్యారు. యెమెన్, జిబౌటి తీర ప్రాంతాల మధ్య ఈ ఘటన జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మీడియాకు తెలిపింది. గల్లంతైన 186 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
3.లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎంలకు స్టాలిన్ లేఖ
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం నాడు లేఖ రాశారు.కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని ఆయన ఆ లేఖలో కోరారు. కేరళ, కర్ణాటక, తెలంగా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల సీఎంలకు ఆయన ఈ లేఖలు పంపారు. మార్చి 22న తమిళనాడులో నిర్వహించే సమావేశానికి రావాలని ఆయన ఆ లేఖలో కోరారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
4.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు నామినేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపర్చారు. నాగబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు వెంటరాగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వనితారాణికి సమర్పించారు.
5.ట్రంప్ తో వాగ్వాదంతో జెలెన్‌స్కీకి పెరిగిన ఆదరణ
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తో వాగ్వాదంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఆదరణ పెరిగింది. ఈ వాదన తర్వాత ఆయనకు 10 శాతం ఉక్రెయిన్ ప్రజల మద్దతు పెరిగింది. కీవ్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్ లో 67 శాతం ఉక్రెయిన్ ప్రజలు తాము జెలెన్‌స్కీని విశ్వసిస్తున్నామని తెలిపారు. గతంలో ఆయనకు 57 శాతంగా మద్దతు ఉండేది. ట్రంప్ తో గోడవతో ఆయనకు 10 శాతం మద్దతు పెరిగింది.
6. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. 2.5 శాతం డీఏను ప్రకటించింది ప్రభుత్వం. ఈ విషయాన్నితెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు 2.5 డీఏతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్ల భారం పడనుంది.