Anna Hazare: ఆప్ ఓటమిపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం ఆయన స్పందించారు.
ఆప్ ఓటమిపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
Anna Hazare Reaction Delhi Election results
Anna Hazare: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం ఆయన స్పందించారు. అధికార, ధన దాహం వల్ల కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. కేజ్రీవాల్ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌తో ఆప్ ప్రభుత్వంతో పాటు కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ కారణాలతో ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారని అన్నారు.
అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నా హజారే ఓ వీడియో సందేశం విడుదల చేశారు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం, ఆలోచనలు ఉన్న వారికి ఓటేయాలని కోరారు. దేశం కోసం త్యాగం చేసి అవమానాన్ని జీర్ణించుకోగల వారికి ఓటు వేయాలన్నారు. పనికిరాని వ్యక్తులకు ఓటు వేయవద్దని ఆయన అన్నారు. ఇలా చేస్తే దేశం సర్వనాశనం అవుతోందన్నారు.
ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతోంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు చాలా మంది ఓడిపోయారు. అయితే అవినీతి కేసుల్లో ఎక్కువ మంది నేతలు ఇరుక్కోవడం ఆప్‌పై తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2011లో ఢిల్లీ కేంద్రంగా అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే అన్నా హజారే పోరాటం తర్వాత 2012లో ఆయన అనుచరుడైన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013లో దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ.. పదేళ్లకు పైగా దేశ రాజధానిలో అధికారం కొనసాగించింది. అయితే కేజ్రీవాల్ రాజకీయాల్లో చేరడాన్ని అన్నా హజారే వ్యతిరేకించారు.ఈ విషయాన్ని పలు సందర్భాల్లో తనే స్వయంగా వెల్లడించారు.
రాజకీయాల్లోకి వద్దని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని తన సలహాను కేజ్రీవాల్ పట్టించుకోలేదని అన్నా హాజారే గతంలో మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు.ఇప్పుడు కేజ్రీవాల్, ఆప్ పై అన్నా హజారే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Delhi Elections Results 2025: ఢిల్లీలో బీజేపి ఎలా గెలిచింది? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడింది?