Oxygen In Vizag Steel Plant: ఊపిరితీస్తున్నా సరే... ఊపిరి పోస్తోన్న విశాఖ స్టీల్ ప్లాంట్

Oxygen In Vizag Steel Plant: దేశం మొత్తానికీ ఆక్సిజన్ (Oxygen) సరఫరా చేసే అన్నపూర్ణలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మారింది.

Update: 2021-04-20 04:17 GMT

Oxygen in Vizag Steel Plant:(File Image)

Oxygen In Vizag Steel Plant: నష్టాల సాకుతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఊపిరి తీసేందుకు మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటి కరోనా పేషెంట్లకు ఊపిరి పోసేందుకు సిద్ధమయ్యింది మన విశాఖ స్టీల్ ప్లాంట్. ప్రజల సొత్తు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను తెగనమ్మాలనుకున్నప్పటికీ.. తల్లిలా ఆదరిస్తూ నేడు దేశం మొత్తానికీ ఆక్సిజన్ (Oxygen) సరఫరా చేసే అన్నపూర్ణలా మారింది. దేశమంతా కరోనా సెకండ్ వేవ్ కమ్ముకునన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. కొవిడ్‌ రోగులకు చికిత్సలో మందులతో పాటు అత్యవసరంగా మారింది ఆక్సిజన్‌..! రోగులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతున్నా... తక్షణం వారికి ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌ కోసం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఉక్కు కర్మాగారాలపై ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలోని కొవిడ్‌ ఆస్పత్రులకు అవసరమైన ప్రాణ వాయువులో సుమారు మూడో వంతు విశాఖ ఉక్కు కర్మాగారమే సరఫరా చేస్తోంది.

ఆక్సిజన్‌ తయారీ విధానం ఇలా...

గాలిలో 20.6% ఆక్సిజన్‌, 78.03% నైట్రోజన్‌, 0.93% శాతం ఆర్గాన్‌ గ్యాస్‌లతో పాటు ఇతర మూలకాలూ ఉంటాయి. ఉక్కు తయారీలో ప్రధానంగా ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఆర్గాన్‌ వాయువుల అవసరం చాలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి లేకుండా ఉక్కుని ఉత్పత్తి చేయలేం. అందుకే ఉక్కు కర్మాగారాలన్నీ... ఈ గ్యాస్‌లను ఉత్పత్తి చేస్లే ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకుంటాయి. క్రయోజనిక్‌ ఎయిర్‌ సప్రెషన్‌ విధానంలో గాలి నుంచి ఈ వాయువుల్ని వేటికవి వేరు చేస్తారు. మైనస్‌ 173 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే వీటిని వేరు చేయడం సాధ్యమవుతుంది. మైనస్‌ 183 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌ వేరవుతుంది. అది గ్యాస్‌ రూపంలో ఉంటుంది. దాన్ని ద్రవరూపంలోకి మార్చి మరింత వడకడితే 99.9 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ లభిస్తుంది. ఒక గంటకు ఒక లక్ష సాధారణ ఘనపు మీటర్ల గాలిని ప్రాసెస్‌ చేస్తే... 13,500 నుంచి గరిష్ఠంగా 18,500 సాధారణ ఘనపు మీటర్ల ద్రవ రూప ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుంది.

ఐదు యూనిట్‌లు...

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఆక్సిజన్‌ తయారీ యూనిట్‌లు ఉన్నాయి. వాటిలో 24 గంటలూ ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మొత్తం ఐదు యూనిట్ల గరిష్ఠ ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం 2,950 టన్నులు. దీనిలో 2,700 టన్నులు వాయురూప, 250 టన్నులు ద్రవరూప ఆక్సిజన్‌. ప్రస్తుతం ఆ ఐదు ప్లాంట్‌లలో కలిపి రోజుకి గరిష్ఠంగా 2,800 టన్నుల వరకు ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దానిలో 100-150 టన్నుల వరకు ద్రవరూప ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. వాయురూపంలోని ఆక్సిజన్‌ పూర్తిగా ప్లాంట్‌ అవసరాలకే సరిపోతుంది. ద్రవరూప ఆక్సిజన్‌లో కూడా కొంత భాగాన్ని ప్లాంట్‌ అత్యవసర అవసరాల కోసం నిల్వ చేసుకుంటున్నారు. ఇది వరకు కొవిడ్‌ ఆస్పత్రులు, ఇతర అవసరాల కోసం ఇక్కడి నుంచి రోజుకి 50-60 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ సరఫరా చేసేవారు. కొవిడ్‌ రోగులకు చికిత్స నిమిత్తం విశాఖ ఉక్కు రోజూ 100 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా లక్ష్యం నిర్దేశించడంతో ఆ మేరకు సరఫరాలు పెంచినట్లు విశాఖ ఉక్కు వర్గాలు వెల్లడించాయి. అవసరాన్నిబట్టి ఒక్కో రోజు 120 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసిన సందర్భాలూ ఉన్నాయని తెలిపాయి.

రాష్ట్రంలో విశాఖ ఉక్కుతో పాటు శ్రీకాకుళంలోని లిక్వినాక్స్‌ సంస్థ (60 టన్నులు), విశాఖలోని ఎలెన్‌బరీ (40 టన్నులు) సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నాయి. ఇంకా కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్‌లోని కొన్ని ఉక్కు, ఇతర సంస్థల నుంచి ఆక్సిజన్‌ తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి రోజుకు 360 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అన్ని రాష్ట్రాలూ ఈ సమస్యను ఎదుర్కొంటోన్నాయి. ప్రత్యేకించి- కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్, ఉత్తర ప్రదేశ్‌లల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడిన పేషెంట్లకు అందించడానికి చాలినంత ఆక్సిజన్ అందించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ సై అంటోంది. ఇప్పటికైనా ప్రైవేటు పరం చేయాలని మంకు పట్టు పట్టిన ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయా లేక తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తాయో చూడాల్సిందే.

Tags:    

Similar News