Railway Budget 2024: సౌత్ సెంట్రల్ రైల్వేకు బడ్జెట్‌లో రూ.14,232 కోట్ల కేటాయింపు

Railway Budget 2024: ఈ బడ్జెట్‌లో కేవలం రూ.42 కోట్లు మాత్రమే కేటాయింపులు

Update: 2024-02-03 13:00 GMT

Railway Budget 2024: సౌత్ సెంట్రల్ రైల్వేకు బడ్జెట్‌లో రూ.14,232 కోట్ల కేటాయింపు

Railway Budget 2024: సార్వత్రిక ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం రైల్వేకి కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించలేదు. 2 లక్షల 52 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినా పాత ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించింది. విద్యుత్, సిమెంట్, కారిడార్స్, పోర్టుల కనెక్టివిటీ, రద్దీ రూట్ల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 14 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది మోడీ సర్కార్.

కేంద్ర రైల్వే బడ్జెట్‌లో సౌత్ సెంట్రల్ రైల్వేకు 14వేల 232 కోట్లను మోడీ ప్రభుత్వం కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రకటించిన బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న నడికుడి - శ్రీకాళహస్తి, మనోహరబాద్ - కొత్తపల్లి, కొత్తపల్లి- నర్సాపూర్ కొత్త లైన్లతో పాటు.. కాజీపేట్ - విజయవాడ, విజయవాడ - గూడూరు లైన్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. డబ్లింగ్, బైపాస్ లైన్లు, సేఫ్టీకి సంబంధించిన లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జిలకు ఎప్పటిలాగే ఈ బడ్జెట్ లో నిధుల కేటాయింపులు జరగగా.. కవచ్ లాంటి టెక్నాలజీకి నిధుల కేటాయింపులు మాత్రం జరగలేదు.

గతేడాది సౌత్ సెంట్రల్ పరిధిలో కవచ్ ఏర్పాటుకు 68 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో కేవలం 42 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇప్పటివరకు వాడి- రేణిగుంట, దువ్వాడ - విజయవాడ, బలార్షా - విజయవాడ - గూడూరు, మన్మాడ్-పరభాని, నాందేడ్-సికింద్రాబాద్ రూట్లలో కవచ్ టెక్నాలజీ ఏర్పాటు అయిందని సౌత్‌ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.

ఇక హైదరాబాద్‌లో ఉండే ప్రజలు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు సాగించేలా తీసుకొచ్చిన MMTSకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ప్రతిపాదనలు పంపినట్టు లేదనిపిస్తుంది. 12 ఏళ్లుగా సాగుతున్న MMTS సెకండ్ ఫేజ్‌కు గత బడ్జెట్‌లో 6వందల కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈ బడ్జెట్‌లో 50 కోట్లను మాత్రమే కేటాయించింది.

మరోవైపు జనవరి నుంచి MMTS సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తామన్న రైల్వే అధికారులు.. ఇంకా ఆ ప్రాజెక్ట్ పూర్తికాలేదని చెబుతున్నారు. అయితే మధ్యంతర బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు కేటాయింపులు జరగకపోయినా.. పూర్తిస్థాయి బడ్జెట్‌లో రైల్వేకు ఊరట ఇచ్చేలా కేటాయింపులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News