Mahakumbh mela: మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. కాశీలో రాకపోకలపై తీవ్ర ఆంక్షలు

Update: 2025-02-11 02:30 GMT

Mahakumbh mela: మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. రోజులు గడుస్తున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. రోజుకు సగటున 1.44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ముగించుకున్న భక్తులు, కాశీ, అయోధ్యలకు వెళ్తున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుండటంతో కాశీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. మరోవైపు రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు లోకో పైలట్ ఉండే ప్రాంతాల్లో కూర్చొనే ప్రయత్నం చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో రైల్వే స్టేషన్ వెలుపల భక్తుల రద్దీ కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలోని లఖ్ నవూ డివిజన్ ఫిబ్రవరి 9 మధ్యాహ్నం నుంచి 14 అర్థరాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మహాకుంభ్ లోని 8 రైల్వే స్టేషన్లు ప్రత్యేక రైల్వే సేవలను అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ లు కనిపిస్తున్నాయి. గంటల కొద్ది యాత్రికులు వాహనాల్లోనే ఉంటున్నారు.

ప్రయాగ్ రాజ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్ లఖ్ నవూ ప్రతాప్ గఢ్, ప్రయాగ్ రాజ్ వారణాసి మిర్జాపూర్, ప్రయాగ్ రాజ్ రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. పుణ్యస్నాలు ముగించుకున్న భక్తులు కాశీ, అయోధ్యకు వెళ్తుండటంతో ఆయా మార్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 44కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News