దడ పుట్టిస్తున్న ధరలు..ఉల్లి ధరతో పోటీపడుతున్న టమాటా!

Update: 2019-10-03 06:19 GMT

నిన్న మొన్నటిదాకా కిలో 10 రూపాయలకే దొరికిన టమాటా ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. మార్కెట్లో ఏకంగా 50 రూపాయల దాకా ధర పలుకుతోంది. దీంతో టమాటాలు కొనడానికి సామాన్యుడు ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఇటీవల కురిసిన వర్షాలే టమాటా ధర ఇంతలా పెరగడానికి కారణమంటున్నారు. భారీ వర్షాల కారణంగా చాలాచోట్ల టమాటా పంట ధ్వంసమైపోయింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి టమాటాను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.

ఒక లోడ్ టమాటా లారీకి దాదాపు 10 వేల వరకు చెల్లిస్తున్నారు. దీంతో టమాటాలను కూడా ధరలు పెంచి అమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే ధరలు దిగొస్తాయంటున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొన్ని రకాల కూరగాయలపై మచ్చలు ఏర్పడి నాణ్యత దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.

మరోవైపు ఉల్లిగడ్డ ధర కూడా పైపైకి ఎగబాకుతూనే ఉంది. ఉల్లిగడ్డలతో అంటుకున్న సెగ టమాటాలు, ఇతర కూరగాయలకూ పాకింది. తెలంగాణలో కూరగాయల పంటలు వర్షాలకు పాడవటంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తెప్పిస్తున్నారు. వర్షాలతో కూరగాయల తోటలకు నష్టం బాగా ఉంది. పూత, కాత రాలడం వల్ల దిగుబడి తగ్గింది. ప్రస్తుతం వర్షాలు ఆగినందున మరో వారం రోజుల్లో మళ్లీ దిగబడి పెరిగి ధరలు తగ్గే అవకాశాలున్నాయి.

వర్షాలకు మచ్చలు పడి కూరగాయల నాణ్యత బాగా తగ్గిపోయింది. మంచి నాణ్యత ఉన్నవాటిని కొనడానికే ప్రజలు ఇష్టపడతారు. వాటికి ధరలు అధికంగా ఉంటున్నాయి. నాణ్యత తక్కువగా ఉన్న పంట ఎక్కువగా వస్తున్నా దాన్ని కొనేవారు లేక ధర ఉండటం లేదు. వర్షాలు ఆగితే ధరల మంట తగ్గుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News