నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లెక్కింపునకు 50వేలకు పైగా సిబ్బంది

Assembly Elections Result 2022: 5 రాష్ట్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

Update: 2022-03-10 01:30 GMT

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లెక్కింపునకు 50వేలకు పైగా సిబ్బంది

Assembly Elections Result 2022: నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. అవును.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యూపీ, మణిపూర్, గోవాతోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్ ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నరాలు తెగే ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. అలాగే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ జరగనుంది.

మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇక ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పంజాబ్ లో కౌంటింగ్ సెంటర్ల వద్ద కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలే పలు రాజకీయ పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంది.

ఎవరి ప్రభుత్వం ఎక్కడ ఏర్పడుతుంది..? ఎవరు ఓడిపోతారు..? అనేది కేవలం కొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఉత్తర ప్రదేశ్ లో మళ్లీ కమలం వికసిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? లేక తారుమారు అవుతాయా..? చూడాలి. ఇక గతంలో కంటే మంచి ఫలితాలు వస్తాయని సీఎం యోగి ఆదిత్యానాథ్ అంటుంటే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాదని.. తామే ఎన్నికల్లో గెలుస్తామని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ అంటున్నారు.

ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ సూచించడంతో పార్టీల్లో టెన్షన్ నెలకొంది. అయితే గెలుపు తమదే అంటున్నారు బీజేపీ నేతలు. దీంతో ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాలకు తెరలేస్తుందనే అంచనాల నడుమ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది.

గోవాలో కూడా బీజేపీ-కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో అక్కడ అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. గతంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయంతో తమ అభ్యర్థులను రిసార్ట్ కు తరలించింది.

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు దాదాపు వేయి 200 హాళ్లను సిద్ధ చేసింది ఈసీ. అదేవిధంగా 50వేల మందికిపైగా సిబ్బందిని నియమించింది. అలాగే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల ఫలితాల ప్రక్రియలో కోవిడ్‌ నిబంధనలు అనుసరించాలని ఈసీ తెలియజేసింది. ఒక్క యూపీలోనే 750కి పైగా కౌంటింగ్ హాళ్లు ఉండగా.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి 650 మందికి పైగా పరిశీలకులను నియమించింది ఎన్నికల కమిషన్.

Tags:    

Similar News