ఘోర ప్రమాదం.. 20 మంది ప్రయాణికుల సజీవదహనం

Update: 2020-01-11 01:14 GMT

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కనౌజ్ జిల్లా చిబ్రామౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలోయి గ్రామానికి సమీపంలో ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దాంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మరణించారని, మరో 21 మందిని ఆసుపత్రికి తరలించినట్లు కన్నౌజ్ పోలీస్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అమ్రేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులలో మరో 12 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని.. కాలుతున్న బస్సు నుంచి దూకడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయని ఎస్పీ తెలిపారు. ఫరూఖాబాద్ నుండి జైపూర్ వెళ్తున్న ఈ బస్సులో డ్రైవర్, క్లీనర్ సహా సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఘటనపై సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే మంత్రి రామ్ నరేష్ అగ్నిహోత్రిని సంఘటన స్థలానికి పంపించారు. అగ్నిహోత్రి పరిస్థితిని సమీక్షించారు. కనౌజ్ డిపో మేనేజర్ నుండి వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు. ఘటనపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఘటనపై కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. 21 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్పించామని, మంటలను నియంత్రించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగర్వాల్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నట్టు చెప్పారాయన. ఈ ఘటనలో ఇంకా ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలిందని.. దాంతో బస్సులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని లక్నో పోలీసు చీఫ్ ఓపీ సింగ్ తెలిపారు. 

Tags:    

Similar News