Kerala: కేరళను అతలాకుతలం చేస్తున్న వరద బీభత్సం

Kerala: కొండచరియలు విరిగిపడి 26మంది దుర్మరణం

Update: 2021-10-17 11:58 GMT

కేరళను ముంచెత్తుతున్న వరదలు (ఫైల్ ఇమేజ్)

Kerala: భారీ వర్షాలు, వరదలు కేరళలో కల్లోలం సృష్టిస్తున్నాయి. పథనంతిట్ట, కొట్టాయంలతో పాటు ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలు వర్షం భీభత్సంతో అల్లాడిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహాదారులు నీటమునిగాయి. వాగులు వంకలు ప్రమాదకర స్ధాయిలో పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్టస్ధాయికి చేరుకుంటున్నాయి. ఈనేపథ్యంలో వాతావరణ శాఖ తిరువనంతపురం, కొల్లాం, అలపుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలతో సహా ఏడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.

మరోవైపు.. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 26మంది మృత్యువాత పడ్డారు. మరింత మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. చూస్తుండగానే ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కొల్లాం, కొట్టాయం జిల్లాలతో సహా అనేక ప్రదేశాలలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కుట్టనాడ్ ప్రాంతంలో జనజీవితం అస్తవ్యస్తమయ్యింది. కొట్టాయం, కొండ జిల్లా ఇడుక్కిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని అధికారులు సూచిస్తున్నారు.

ఇదే సమయంలో మీనాచల్, మణిమాలతో సహా అనేక నదులలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రానున్న 24 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని నదులలో నీటి మట్టం పెరుగుతుందని, ఇక ఆనకట్టలు పొంగిపొర్లుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని.. అత్యవసర సహాయం అందించడానికి అధికారుల సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. 

Tags:    

Similar News