Movies On Lord Shiva: శివుని చుట్టూ సాగే కథ.. ఆకట్టుకుంటున్న చిత్రాలు..
ఇటీవల దైవత్వం ఉన్న సినిమాలు తీస్తూ దర్శక, నిర్మాతలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శివుడితో ముడిపడి ఉన్న కాన్సెప్టులు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.
శివుని చుట్టూ సాగే కథ.. ఆకట్టుకుంటున్న చిత్రాలు..
Movies On Lord Shiva: ఇటీవల దైవత్వం ఉన్న సినిమాలు తీస్తూ దర్శక, నిర్మాతలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శివుడితో ముడిపడి ఉన్న కాన్సెప్టులు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఆ చిత్రాలేంటో చూద్దాం.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. శివుడి భక్తుడైన కన్నప్ప చరిత్ర స్ఫూర్తితో ఈ మూవీని రూపొందిస్తున్నారు. కన్నప్ప వీరత్వం, ఆయన భక్తిని తెలియజేస్తూ.. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. శివుని పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించగా.. తిన్నడుగా విష్ణు కనిపించనున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ పరమశివుని భక్తుడిగా నటించి, మెప్పించారు. దీనికి సీక్వెల్‌గా అఖండ 2 సినిమా ప్రారంభమైది. ఈ మూవీ సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల మహాకుంభమేళాలో నిర్వహించారు. అఖండకు మించి అఖండ 2 ఉంటుందంటోంది చిత్ర బృందం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ఓదెల 2. ఓదెల మల్లన్నస్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనే కథాంశంతో దర్శకుడు అశోక్ తేజ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శివశక్తిగా.. దైవిక నాగ సాధువుగా తమన్నా నటిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట, ఎన్ సింహా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల మహాకుంభమేళాలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం హైందవ. ఓ అడవిలోని పురాతన ఆలయం చుట్టూ సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సాయి శ్రీనివాస్ అఘోరాగానూ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
సుధీర్ బాబు హీరోగా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న చిత్రం జటాధర. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ సాగే కథ ఇది. అక్కడ సంపద, వివాదాలు, పురాణ చరిత్రను చూపించనున్నారు. శివుడి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఈ మూవీలో ఉండనున్నట్టు సమాచారం. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
అరవింద్ కృష్ణ, అషురెడ్డి, జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏ మాస్టర్ పీస్. సూపర్ హీరో మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలోనూ శివుడి నేపథ్యం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాలే కాదు సినిమాల్లోని శివుని పాటలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తండేల్ మూవీలోని నమో నమః శివాయ పాట విశేషంగా అలరించింది. నాగచైతన్య, సాయి పల్లవి నాట్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్వరలో విడుదల కానున్న భైవరంలోనూ భం భం అంటూ సాగే శివుడి పాట ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రమిది.