OTT:ఓ వైపు తెరపై.. మరోవైపు ఓటీటీలో సందడి చేస్తున్న తారలు..
ఓ వైపు వెండితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు ఓటీటీలో వైవిధ్యమైన కథలతో వస్తున్నారు హీరోయిన్స్. బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించినా.. ఏడాదిలో ఒక్క ప్రాజెక్టుతోనైనా ఓటీటీలో అడుగు పెడుతున్నారు.
ఓ వైపు తెరపై.. మరోవైపు ఓటీటీలో సందడి చేస్తున్న తారలు..
OTT: ఓ వైపు వెండితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు ఓటీటీలో వైవిధ్యమైన కథలతో వస్తున్నారు హీరోయిన్స్. బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించినా.. ఏడాదిలో ఒక్క ప్రాజెక్టుతోనైనా ఓటీటీలో అడుగు పెడుతున్నారు. భిన్నమైన వెబ్ సిరీస్‌లు, చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలతో సందడి చేయడానికి ముస్తాబవుతున్నారు. ఇంతకీ ఓటీటీలో పోరాటాలు చేస్తున్న ఆ నటీమణులు ఎవరు.. వారి సినిమా విశేషాలు ఏంటో ఏ సారి చూద్దాం.
నయనతా నటించే సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరణ లభిస్తుంది. ఆమె సినిమా చేసిందంటే అది కచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియన్స్ చూస్తారు. ఇక ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఆమె నటించిన చిత్రం టెస్ట్. ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఎస్. శశికాంత్ దర్శకత్వం వహించారు. చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో రూపొందించిన చిత్రమే టెస్ట్. ఈ సినిమాలో నయనతారాతో పాటు ఆర్.మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే దీన్ని ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుపుతూ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో ప్రధానంగా నయనతార కొన్ని పోరాట ఘట్టాల్లో భాగమైనట్టు సమాచారం.
ఓటీటీ వేదికగా సందడి చేయడానికి రెడీ అయిన మరో హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్ అక్క. భారీ బడ్జెట్‌తో యశ్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తోంది. దీనికి ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనున్నారు. రాధిక ఆప్టే డిఫరెంట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ సిరీస్ చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో అక్కగా కీర్తి అదరగొట్టేలా ఉన్నారు. ఇక రాధిక ఆప్టే, కీర్తి సురేష్ మధ్యే పోరు సాగేలా ఉంది. అక్క అనే పవర్ కోసం కీర్తి సురేష్, రాధిక ఆప్టే మధ్య యుద్ధం జరిగేలా ఉంది. అంతా ఆడవారి పెత్తనం.. అది ఆడ సామ్రాజ్యమే అన్నట్టుగా ఈ అక్క సిరీస్‌లో కనిపిస్తోంది. మరి ఈ సిరీస్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ది ఫ్యామిలీ మ్యాన్2, సిటాడెట్ లాంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీ వేదికగా ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించారు నటి సమంత. ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్ అనే సిరీస్‌తో మూడోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను అనిల్ బార్వే రూపొందిస్తున్నారు. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న మొదటి యాక్షన్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్‌లో సమంత భారీ ఫైటింగ్ సన్నివేశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి రక్త్ బ్రహ్మాండ్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
తాప్సీ గాంధారి చిత్రంలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను దేవాశిశ్ మఖిజా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో తాప్సి ప్రతీకారం తీర్చుకునే తల్లిగా ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆమె డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నట్టు సమాచారం. కనికా థిల్లార్ దీన్ని నిర్మిస్తున్నారు. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది.