Tollywood Sankranti 2026 Releases: 2026 సంక్రాంతి టాలీవుడ్ రిలీజ్‌లు.. హిట్స్ & ఫ్లాప్స్ పై భారీ పోటీ
తెలుగు సినీ పరిశ్రమ 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, అందరి చూపు సంక్రాంతి పండుగపైనే ఉంది.
తెలుగు సినీ పరిశ్రమ 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, అందరి చూపు సంక్రాంతి పండుగపైనే ఉంది. జనవరి ప్రారంభంలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, అసలైన యుద్ధం మాత్రం సంక్రాంతి బరిలోనే జరగనుంది. ది రాజా సాబ్, మన శంకర్ వరప్రసాద్, భరత మహాశయులకు విన్నప్తి, అనగనగా ఒక రాజు, మరియు నారీ నారీ నడుమ మురారి.. ఇలా వరుస సినిమాలు ఈ సంక్రాంతి రేసులో నిలిచాయి.
సంక్రాంతి అంటే కేవలం సెలవులు మాత్రమే కాదు, అది సినిమాల పండుగ. ఇక్కడ ఒక్క హిట్ పడితే కెరీర్లు మలుపు తిరుగుతాయి, అదే ఫ్లాప్ అయితే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే 2026 సంక్రాంతి చాలా మంది నటీనటులకు, దర్శకులకు అగ్నిపరీక్షగా మారింది.
ది రాజా సాబ్: ప్రభాస్ కంటే మారుతికే పెద్ద పరీక్ష!
ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరింది, కాబట్టి హిట్ ఫ్లాపులతో ఆయన క్రేజ్ తగ్గకపోవచ్చు. కానీ, దర్శకుడు మారుతికి ఇది కెరీర్ డిసైడింగ్ మూవీ. 'పక్కా కమర్షియల్' నిరాశపరిచిన తర్వాత, ఒక సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. మారుతి పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదుగుతారా లేదా అనేది ఈ సినిమా ఫలితంపైనే ఆధారపడి ఉంది.
అలాగే, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్‌లకు ఇది గోల్డెన్ ఛాన్స్. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కూడా ఇది చాలా ముఖ్యం. గత కొన్ని నష్టాల నుండి కోలుకుని మళ్ళీ నిలదొక్కుకోవాలంటే 'రాజా సాబ్' బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.
మన శంకర్ వరప్రసాద్: మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ దీనిపైనే!
ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి వరుస నిరాశల తర్వాత 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఆ సినిమా కూడా సంక్రాంతికే విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఇప్పుడు 'మన శంకర్ వరప్రసాద్' పై కూడా అదే సెంటిమెంట్ పనిచేస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోకు ఇది మొదటి పెద్ద ప్రాజెక్ట్, ఇందులో గెలిస్తే ఆయన టాప్ లీగ్‌లోకి చేరిపోతారు.
రవితేజ, శర్వానంద్‌లకు అగ్నిపరీక్ష
శర్వానంద్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్ ఫ్యామిలీ సినిమాలకు బాగా కలిసి వస్తుంది కాబట్టి, 'నారీ నారీ నడుమ మురారి'తో ఆయన మళ్ళీ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నారు.
మరోవైపు రవితేజపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. 2025లో ఆశించిన విజయాలు అందకపోవడంతో, ఈసారి తన శైలి మార్చుకుని 'భరత మహాశయులకు విన్నప్తి' అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమలకు కూడా తన సత్తా నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.
అనగనగా ఒక రాజు: నాగవంశీకి కలిసొచ్చేనా?
ప్రముఖ నిర్మాత నాగవంశీకి 2025 అంతగా కలిసిరాలేదు. అందుకే 2026 సంక్రాంతిపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. 'అనగనగా ఒక రాజు' హిట్టయితే మళ్ళీ నిర్మాతగా ఆయన జోరు పెరుగుతుంది.