ఘనంగా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు)’ సినిమా టైటిల్ లాంఛ్

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు)’ టైటిల్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Update: 2025-12-13 13:35 GMT

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు)’ టైటిల్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఈ కార్యక్రమంలో పలువురు చిత్రబృంద సభ్యులు మాట్లాడారు.

డీఓపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ, తల్లాడ సాయికృష్ణకు సినిమా అంటే అపారమైన తపన ఉందని, ఎప్పుడూ కథలు రాయడం, వాటిని దృశ్యరూపంలోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉంటాడని అన్నారు. అతని అంకితభావాన్ని చూసి ఈ సినిమాకు తన వంతు సహకారం అందించానని, ఈ చిత్రంతో సాయికృష్ణకు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.

డాక్టర్ ఏఎంఆర్ మాట్లాడుతూ, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కుకునేందుకు సాయికృష్ణ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని చెప్పారు. ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ సినిమాతో అతనికి విజయం దక్కాలని, ప్రేక్షకులందరూ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ, తాను అమెరికాలో ఉంటూ కూడా సినిమాలపై ఆసక్తితో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని తెలిపారు. ఇండస్ట్రీలో సాయికృష్ణ పడుతున్న కష్టాన్ని చూసి అతనికి సపోర్ట్‌గా ముందుకు వచ్చానన్నారు. ఈ సినిమాలో తాను కూడా ఒక మంచి పాత్రలో నటించానని చెప్పారు.

నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ, సాయికృష్ణ తనను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారని గుర్తు చేశారు. ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ చిత్రాన్ని కమర్షియల్ అంశాలు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని, ఇందులో తాను ఒక కీలక పాత్రలో కనిపిస్తానన్నారు. సాయికృష్ణతో కలిసి మరో పెద్ద సినిమా కూడా చేయనున్నట్లు వెల్లడించారు.

హీరోయిన్ ఏకదంతాయ సిరి మాట్లాడుతూ, చిన్న సినిమాల్లో గ్లామర్‌కే ప్రాధాన్యం ఇస్తారన్న భావనకు భిన్నంగా, దర్శకుడిగా సాయికృష్ణ ఎంతో సిన్సియారిటీ చూపించారని చెప్పారు. చాలా వేగంగా, పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశారని, ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ, ఈ సినిమాతో సాయికృష్ణకు మంచి విజయం రావాలని, అతను ఇండస్ట్రీలో స్థిరపడాలని ఆకాంక్షించారు.

హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ, సాయిబాబా ఆశీస్సులతోనే ఈ సినిమా కథ మొదలైందని చెప్పారు. సినిమా ప్రారంభ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సినిమా చేయాలనే నమ్మకం, పట్టుదల వల్ల ముందుకు వెళ్లగలిగామని తెలిపారు. వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్, దశరథ్ గారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగిందన్నారు. ఈ చిత్రంలో సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు డివోషనల్ టచ్ కూడా ఉంటుందని వెల్లడించారు. షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

చిత్ర సమర్పకులు కె. దశరథ్ మాట్లాడుతూ, సాయికృష్ణకు సినిమా అంటే ఉన్న ప్యాషన్ తనను ఆకట్టుకుందని చెప్పారు. కథ విన్న వెంటనే ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని అనిపించిందని, అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నిలిచానన్నారు. ఈ సినిమాతో సాయికృష్ణకు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News