"రామానాయుడు స్టూడియో దాకా నడుచుకుంటూ వెళ్లేవాడిని" అంటున్న డైరెక్టర్

* డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుకాకముందు తన కష్టాల గురించి చెబుతున్న సూర్య ప్రతాప్ పల్నాటి

Update: 2023-01-09 14:00 GMT

"రామానాయుడు స్టూడియో దాకా నడుచుకుంటూ వెళ్లేవాడిని" అంటున్న డైరెక్టర్ 

Palnati Surya Pratap: ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మారడం అంత సులువైన పనేం కాదు. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్గా నిలబడడానికి వెనుక వారు పడాల్సిన ఎంతో కష్టం ఉంది. "కుమారి 21ఎఫ్" సినిమాతో డైరెక్టర్ గా మారిన పల్నాటి సూర్య ప్రతాప్ వెనుక కూడా అలాంటి ఒక కథ ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన "రంగస్థలం", "పుష్ప" సినిమాలకు రైటింగ్ విభాగంలో కూడా పనిచేసిన సూర్య ప్రతాప్ ఈ మధ్యనే "18 పేజెస్" సినిమాతో మరొక సక్సెస్ ను అందుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్టర్ కాకముందు తాను పడిన కష్టాల గురించి, ఆయన జర్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "హైదరాబాద్ లో ఎంబీఏ చదువుతున్న అక్క దగ్గర ఉంటూ ఎంసీఏలో చేరాను. సినిమా మీద ఇష్టం తో చదువుతూనే సినిమా ప్రయత్నాలు కూడా చేసేవాణ్ణి. సురేష్ ప్రొడక్షన్స్ వారు హిందీ తెలిసిన వారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తున్నారని తెలిసి రాత్రింబవళ్లు స్టూడియో చుట్టూ తిరగటం మొదలు పెట్టాను. బస్ ఎక్కితే ఖర్చవుతుంది అని అమీర్ పేట్ నుంచి రామా నాయుడు స్టూడియోస్ వరకు 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడిని.

తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో హిందీ స్క్రిప్ట్ రాసే వ్యక్తి మానేశాడని తెలిసి వెళ్ళాను. కానీ ఆ అబ్బాయి మళ్ళీ రావటంతో నాకు అవకాశం దొరకలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. తిండి కూడా మానేశాను. కానీ సరిగ్గా ఐదు రోజులకి రామానాయుడు గారు నన్ను గుర్తు పెట్టుకుని మరీ పిలిచారు. అలా సరిగ్గా 19 ఏళ్ల క్రితం రామానాయుడు స్టూడియోస్ తో నా ప్రయాణం మొదలైంది. మధ్యలో కొన్ని కష్టాలు ఎదురయ్యాయి కానీ హనుమాన్ జంక్షన్ సినిమా సమయంలో సుకుమార్ అన్నతో పరిచయం ఏర్పడింది. అక్కడినుంచి నాకు కొత్త జీవితం మొదలైనట్లు అయింది," అని చెప్పుకొచ్చారు సూర్య ప్రతాప్.

Tags:    

Similar News