Ileana : ఇలియానా కెరీర్‌ను ముంచేసిన ఆ 40 లక్షలు.. సౌత్ ఇండస్ట్రీ బ్యాన్ వెనుక అసలు కథ ఇదే!
ఇలియానా కెరీర్‌ను ముంచేసిన ఆ 40 లక్షలు.. సౌత్ ఇండస్ట్రీ బ్యాన్ వెనుక అసలు కథ ఇదే!
Ileana : టాలీవుడ్‌లో ఒకప్పుడు గోవా బ్యూటీ ఇలియానా క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. తన నడుము వంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అమ్మడు, అప్పట్లో కోటికి పైగా రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. కానీ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సౌత్ సినిమాలకు ఇలియానా హఠాత్తుగా దూరం కావడం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం 40 లక్షల రూపాయల అడ్వాన్స్ వివాదం ఆమె కెరీర్‌ను ఎలా దెబ్బతీసిందో నిర్మాత కాట్రాగడ్డ ప్రసాద్ బయటపెట్టిన నిజాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాట్రాగడ్డ ప్రసాద్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలో ఇలియానా ఒక తమిళ చిత్రానికి సైన్ చేసి 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో సదరు నిర్మాత తన అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని కోరగా, ఇలియానా మాత్రం ససేమిరా అంది. తాను సినిమా కోసం డేట్లు కేటాయించానని, నిర్మాతలే వాడుకోలేదని, కాబట్టి డబ్బులు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని మొండికేసింది. ఈ వివాదం చివరకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి వెళ్ళింది.
ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఇలియానా వాదనను పరిశీలించేందుకు ఆమె సమర్పించిన లాగ్ షీట్లు, డేట్లను తనిఖీ చేశారు. అయితే అక్కడే అసలు గుట్టు బయటపడింది. ఇలియానా ఆ తమిళ సినిమాకు ఇచ్చానని చెప్పిన డేట్లలోనే ఆమె వేరే సినిమాల షూటింగ్‌ల్లో బిజీగా ఉందని తేలింది. అంటే ఆమె ఛాంబర్‌కు ఫేక్ డేట్లు ఇచ్చి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిందని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆగ్రహించిన ఛాంబర్ సభ్యులు.. వెంటనే ఆ 40 లక్షల రూపాయలు చెల్లించాలని, లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ ఇలియానా తన పంతాన్ని వీడలేదు.
డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెపై అప్రకటిత నిషేధం అమల్లోకి వచ్చింది. ఇలియానాతో ఏ నిర్మాత అయినా సినిమా చేయాలనుకుంటే, ముందుగా ఆమె బాకీ ఉన్న 40 లక్షల రూపాయలు సదరు నిర్మాతలే కట్టాలని కండిషన్ పెట్టింది. ఒక హీరోయిన్ కోసం పాత బాకీలు కట్టడం ఎందుకని భావించిన ఇతర నిర్మాతలు ఆమెకు ఆఫర్లు ఇవ్వడం మానేశారు. అలా శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమా ఆమెకు సౌత్‌లో చివరి చిత్రమైంది. అప్పట్లో కోట్లు సంపాదించే సత్తా ఉన్న ఇలియానా, కేవలం 40 లక్షల కోసం మొండిగా వ్యవహరించి తన బంగారు భవిష్యత్తును తానే చేజేతులా పాడు చేసుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.