Thalapathy Vijay : ఆఖరి సినిమా..అరాచకమైన క్రేజ్..దళపతి దండయాత్రకు విదేశీ పోలీసులు బ్రేక్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం జన నాయగన్ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి
Thalapathy Vijay : ఆఖరి సినిమా..అరాచకమైన క్రేజ్..దళపతి దండయాత్రకు విదేశీ పోలీసులు బ్రేక్
Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం జన నాయగన్ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి విదేశాల్లో నిర్వహించాలనుకుంటున్న భారీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ఇప్పుడు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. మలేషియా పోలీసులు విజయ్‌కు కొన్ని కఠినమైన నిబంధనలు విధించారు.
విజయ్ తన ఆఖరి సినిమా కావడంతో ప్రచారాన్ని ప్రపంచస్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. మలేషియాలో తమిళ ప్రజలు భారీ సంఖ్యలో ఉండటంతో అక్కడికి వెళ్లాలని దళపతి నిర్ణయించుకున్నారు. అయితే, తాజాగా కౌలాలంపూర్ పోలీస్ కమిషనర్ మీడియాలో మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కు కేవలం వినోద కార్యక్రమంగా మాత్రమే అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ సభగా మార్చకూడదని వారు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిబంధన ప్రకారం విజయ్ తన ప్రసంగంలో ఎటువంటి రాజకీయ అంశాలను ప్రస్తావించకూడదు. తన పార్టీ అజెండాను కానీ, తమిళనాడు రాజకీయాల గురించి కానీ మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరయ్యే అభిమానుల సంఖ్యపై కూడా ఆంక్షలు విధించారు. స్టేడియం సామర్థ్యం కంటే ఎక్కువ మంది రాకూడదని పోలీసులు పేర్కొన్నారు. విజయ్ తన రాజకీయ భవిష్యత్తుకు ఈ సినిమానే పునాదిగా భావిస్తున్న తరుణంలో, ఈ ఆంక్షలు ఆయన అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తున్నాయి.
వాస్తవానికి జన నాయగన్ సినిమాను విజయ్ రాజకీయ అజెండాను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి భారీ తారాగణం ఉంది. కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను బలోపేతం చేసేందుకు ఈ సినిమా షూటింగ్ ముగియగానే పూర్తి సమయం కేటాయించనున్నారు. ప్రచార కార్యక్రమాల్లో తన పొలిటికల్ అజెండాను గట్టిగా వినిపించాలని ఆయన భావించారు కానీ, విదేశీ గడ్డపై పోలీసులు పెట్టిన రూల్స్ ఇప్పుడు అడ్డంకిగా మారాయి. మరి ఈ ఆంక్షల నడుమ విజయ్ తన ఆఖరి సినిమా ఈవెంట్‌ను ఎలా నిర్వహిస్తారో చూడాలి. ఏదేమైనా జన నాయగన్ ఆడియో లాంచ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.