Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
మంచు మోహన్ బాబు(Manch Mohanbabu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను సోమవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
మంచు మోహన్ బాబు(Manch Mohanbabu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను సోమవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కుటుంబ వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలను కవరేజీ కోసం జల్ పల్లిలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లిన జర్నలిస్టుపై డిసెంబర్ 10వ తేదీ రాత్రి మోహన్ బాబు దాడికి దిగారు. దీనిపై జర్నలిస్టు రంజిత్ కుమార్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనారోగ్య కారణాలను చూపుతూ తనకు ముందస్తు బెయిల్ (Aniticipatory Bail) ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గుండె, నరాల సమస్యలున్నాయని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వవద్దని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.
తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ తర్వాత హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయాన్ని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అసలు ఎలాంటి పరిచయం లేని వ్యక్తిపై ఎందుకు హత్య చేయాలనుకుంటారని ఆయన ప్రశ్నించారు. మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కనీసం ఆయన ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని కూడా పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగానే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు వివరించారు.ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
అసలు వివాదం ఏంటి?
మంచు మనోజ్ (Manchu Manoj), మంచు మోహన్ బాబు, మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య కుటుంబ వివాదాలున్నాయి.ఈ క్రమంలోనే డిసెంబర్ 10న మంచు మనోజ్ జల్ పల్లిలోని ఇంటికి వచ్చిన సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. తనపై దాడి జరిగిందని మనోజ్ తన చెరిగిన చొక్కాను మీడియాకు, పోలీసులకు చూపారు. ఈ విషయమై మీడియా తో మాట్లాడేందుకు ఆయన గేటు బయటకు వస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో గేటు బయటకు వచ్చిన మోహన్ బాబు ఈ గొడవపై ప్రశ్నించిన ఓ మీడియా ఛానెల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ పై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.