Show Time Review: నవీన్ చంద్ర 'షో టైమ్' భయపెట్టిందా?.. థ్రిల్లింగ్ కామెడీతో కొత్త ప్రయోగం!
Show Time Review: అనిల్ సుంకర సమర్పణలో, స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ గరికిపాటి నిర్మించిన చిత్రం షో టైం.
Show Time Review: నవీన్ చంద్ర 'షో టైమ్' భయపెట్టిందా?.. థ్రిల్లింగ్ కామెడీతో కొత్త ప్రయోగం!
Show Time Review: అనిల్ సుంకర సమర్పణలో, స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ గరికిపాటి నిర్మించిన చిత్రం షో టైం. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. ఈ థ్రిల్లర్ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్‌లు వేసేంత నమ్మకంతో చిత్ర బృందం ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా, నవ్వించిందా అనేది తెలుసుకుందాం.
ఒక రాత్రి కథ
'షో టైమ్' కథ చాలా సింపుల్ గా ప్రారంభమవుతుంది. ఒక అర్ధరాత్రి 11 గంటలకు, సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి భాస్కర్ల) తమ ఫ్యామిలీతో ఇంట్లో ఆనందంగా, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పొరుగున ఉన్న సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) వచ్చి, శబ్దం చేస్తున్నారంటూ హెచ్చరిస్తాడు. సూర్య, శాంతి, సీఐ మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. సీఐ లక్ష్మీకాంత్ ఏదో చేస్తాడేమో అని సూర్య భయపడడం మొదలుపెట్టిన వెంటనే కథ కీలక మలుపు తిరుగుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ చిక్కుల్లో నుంచి వారు ఎలా బయటపడ్డారు? వారికి లాయర్ వరదరాజులు (వి.కె. నరేష్) ఎలా సహాయం చేశాడనేది తెరపై చూడాలి.
దర్శకత్వం
ఈ సినిమా కథ మొత్తం ఒకే ఒక్క రోజులో జరుగుతుంది. దర్శకుడు మదన్ దక్షిణామూర్తి ఒక సింపుల్ కథను చాలా నీట్‌గా, గ్రిప్పింగ్‌గా చూపించాడు. మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపించే 'సింగిల్ రూమ్ థ్రిల్లర్' ఫార్మాట్‌ను తీసుకుని, ప్రేక్షకులను ఆద్యంతం సినిమాతో కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిమిషాల నిడివితో చాలా తక్కువ సమయంలో ముగుస్తుంది. అసలు కథ, ఉత్కంఠ అంతా సెకండ్ హాఫ్లోనే ప్రారంభమవుతాయి.
ఎప్పుడైతే వి.కె. నరేష్ లాయర్ పాత్రలో ఎంటర్ అవుతాడో, అక్కడి నుంచి కథనం చాలా సరదాగా, నవ్వించే విధంగా మారుతుంది. అదే సమయంలో సస్పెన్స్‌ను కూడా దర్శకుడు చాలా సమర్థవంతంగా మెయింటైన్ చేశాడు. సస్పెన్స్, కామెడీని కలిపి చెప్పేటప్పుడు సంభాషణలు చాలా పదునుగా ఉండాలి. ఆ విషయంలో చిత్ర బృందం సక్సెస్ అయిందనే చెప్పాలి. గవిరెడ్డి శ్రీనివాస్ అందించిన డైలాగులు తెర మీద బాగా పండాయి. రాజా రవీంద్ర, వి.కె. నరేష్ మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఇక క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని విధంగా, చాలా విభిన్నంగా ఉంటుంది, ఇది సినిమాకు ఒక ప్లస్ పాయింట్.
నటీనటుల పర్ఫార్మెన్స్
ఇలాంటి థ్రిల్లర్ పాత్రలు నవీన్ చంద్రకు కొత్తేమీ కాదు. తన అనుభవంతో, ఈ పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. లాయర్ వరదరాజులు పాత్రలో వి.కె. నరేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అతని పాత్ర సినిమాకు ఒక పెద్ద బలం. సైకో పోలీస్ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాను నడిపించడంలో అతని పాత్ర కీలకమైనది. తన పాత్ర పరిధి మేరకు కామాక్షి కూడా బాగా నటించి మెప్పించింది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో జెమినీ సురేష్ నవ్వించాడు.
సాంకేతిక అంశాలు
శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. సన్నివేశాలకు సరిగ్గా సరిపోయి, ఉత్కంఠను మరింత పెంచింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
చివరగా
'షో టైమ్' సినిమా నవ్విస్తూ, భయపెడుతూ ఒక వినూత్న అనుభూతిని ఇస్తుంది. కామెడీ, సస్పెన్స్‌లను కలిపి మదన్ దక్షిణామూర్తి చేసిన ఈ ప్రయోగం బాగా వర్కౌట్ అయింది. ఒకే గదిలో కథ నడిచినా, ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
రేటింగ్: 3/5