Rajamouli Mahesh: షూటింగ్‌ మొదలై నెలైనా ఒక్క అప్డేట్‌ లేదేంటి.? ఇంతకీ ఏం జరుగుతోంది.?

Update: 2025-03-09 06:34 GMT

బాహుబలితో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ట్రిపులార్‌ సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ స్థాయికి ఎదిగారు. దీంతో రాజమౌళి నుంచి వస్తున్న తదుపరి చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం చేయడం లేదు. చిత్రీకరణ మొదలై సుమారు నెల రోజులు గడుస్తోన్నా.. ఎక్కడ జరుగుతోంది? ఏం చిత్రీకరిస్తున్నారు? అనే వివరాలు బయటకు రాకుండా జక్కన్న బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.

అయితే తాజా అప్‌డేట్ ప్రకారం, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి టీం హైదరాబాద్‌ను వదలలేదు. రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పటివరకు మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు తొలిసారి SSMB29 టీం హైదరాబాద్‌ను వీడి ఒడిశాకు వెళ్లింది.

డియోమాలి, తలమాలి, కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో 23 రోజుల పాటు చిత్రీకరణ జరుగనుంది. కోలాబ్ డ్యామ్ పరిసరాల్లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజమౌళి ఒడిశాలోని ఓ హోటల్‌లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమా రూపొందుతుంది. టాకీ పార్ట్‌ను ఏడాదిలోపు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలని రాజమౌళి భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు సాగితే 2027లో SSMB29 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News