Raja Saab: ఈ తెల్ల చీర ప్రభాస్ ఇచ్చారు.. అందుకే ఈవెంట్ కి వేసుకొని వచ్చా, హీరోయిన్ వైరల్ కామెంట్స్..!!

Raja Saab: ఈ తెల్ల చీర ప్రభాస్ ఇచ్చారు.. అందుకే ఈవెంట్ కి వేసుకొని వచ్చా, హీరోయిన్ వైరల్ కామెంట్స్..!!

Update: 2025-12-28 06:19 GMT

Raja Saab: పాన్ ఇండియా స్థాయి స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ విడుదలకు పూర్తిగా సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కామెడీ, హారర్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కింది. ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అన్ని షూటింగ్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్‌లో ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు మారుతి, చిత్రబృందం మొత్తం హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని పండగలా మార్చారు. ప్రభాస్ ఎంట్రీతోనే ప్రాంగణం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. అభిమానుల ఉత్సాహం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్ గారి కోసం సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఒక మధురమైన అనుభవం. మూడు సంవత్సరాల క్రితం ప్రభాస్ గారు నాకు కానుకగా ఇచ్చిన చీరనే ఈ రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధరించి వచ్చాను అని రిద్ధి చెప్పగానే హాల్ మొత్తం చప్పట్లతో, హర్షధ్వానాలతో మార్మోగింది. అభిమానులు ప్రభాస్… ప్రభాస్… అంటూ నినాదాలు చేయడంతో ఆ క్షణం మరింత ఎమోషనల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

మరో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రభాస్‌తో సినిమా చేయడం తన జీవితంలో దక్కిన గొప్ప అవకాశమని అన్నారు. ప్రభాస్‌తో ఉంటే ప్రతి రోజూ పండగే. ఆయన సింప్లిసిటీ, కేర్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను అంటూ డార్లింగ్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. మూడో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నది నా కల. అలాంటి సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని ఆమె తెలిపారు.

మొత్తంగా ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ క్రేజ్‌తో పాటు హీరోయిన్ల హృదయాన్ని తాకే మాటలతో అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Tags:    

Similar News