సీక్వెల్ కి రెడీ ఔతున్న ఇస్మార్ట్ టీమ్

Puri Jagannadh: సీక్వెల్ కి రెడీ ఔతున్న ఇస్మార్ట్ టీమ్

Update: 2023-04-28 16:00 GMT

సీక్వెల్ కి రెడీ ఔతున్న ఇస్మార్ట్ టీమ్

Puri Jagannadh: పూరిజగన్నాథ్..తెలుగు సినిమాని పరుగులు పెట్టించిన దర్శకుడు. హీరోయిజానికి ఒక కొత్త డెఫినిషన్ ఇచ్చిన ఘనాపాటి. కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చని చేసి చూపించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. బద్రి, ఇడియట్, పోకిరి, చిరుత ఇలా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అందించి హీరోతో సరిసమానమైన మాస్ ఇమేజ్ ని బ్రాండ్ వాల్యూని సంపాదించుకున్నాడు. కానీ ఎంతటివారికైనా పరాజయాలు తప్పవు. పూరిజగన్నాథ్ విషయంలో కూడా అదే జరిగింది. విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి తీసిన లైగర్ డిజాస్టర్ ఫ్లాప్ కావడంతో పూరి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

పూరిజగన్నాథ్ తో సినిమా చేయాలని కలలు కన్న స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు ఆయన పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. లైగర్ దెబ్బతో విజయదేవరకొండతో ప్రారంభించిన జనగణమన అటకెక్కేసింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా ప్రస్తుతం ఆ ఊసే లేదు. లైగర్ రిజల్ట్ చూసి పూరిజగన్నాథ్ మళ్లీ సినిమాలు తీస్తారా లేక ఆపేస్తారా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద డిస్కషనే పెట్టారంటే..ఆ సినిమా ఎఫెక్ట్ ఈ స్టార్ డైరెక్టర్ పై ఏ రేంజ్ లో పడిందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీలో నం1 కమర్షియల్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన పూరీ ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడే స్థాయికి వచ్చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే లైగర్ ఫ్లాప్ తో సైలెంట్ అయిపోయిన పూరిజగన్నాథ్ మళ్లీ జూలు విదిల్చేందుకు రెడీ అయ్యాడు. మెగా ఫోన్ పట్టి తనలో మునుపటి కసి అలానే ఉందని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ తీసేందుకు పూరి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం రామ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ముగియనుండగా దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో రామ్ నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే పూరిజగన్నాథ్ సినిమాని కూడా పట్టాలెక్కించాలని రామ్ భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ అటు రామ్ ఇటు పూరిజగన్నాథ్ ఇద్దరికి కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చింది. మరి, ఈ సీక్వెల్ సినిమాతో ఇద్దరు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News