The Raja Saab: అది ప్రభాస్ కాదు... డూప్ రాజాసాబ్ పై ట్రోల్స్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ ‘ది రాజాసాబ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో 'ట్రోలింగ్ మెటీరియల్'గా మారిపోయింది.

Update: 2026-02-09 05:49 GMT

The Raja Saab: అది ప్రభాస్ కాదు... డూప్ రాజాసాబ్ పై ట్రోల్స్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ ‘ది రాజాసాబ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో 'ట్రోలింగ్ మెటీరియల్'గా మారిపోయింది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఎదురైన విమర్శలు ఒక ఎత్తైతే.. ఇప్పుడు జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వేళ నెటిజన్లు సీన్ టు సీన్ పట్టుకుని ఏకిపారేస్తున్నారు. మారుతి చేసిన బేసిక్ మిస్టేక్స్ ఇప్పుడు మీమ్స్ రాయుళ్లకు పండగలా మారాయి.

సినిమా రిలీజ్ ముందు మారుతి అతి విశ్వాసంతో "సినిమా బాగాలేకపోతే నా ఇంటికే రండి" అని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయనకే శాపమయ్యాయి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో కొందరు ఆవేశంతో మారుతి ఇంటి అడ్రస్ కనుక్కుని వందల కొద్దీ 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్స్ పెట్టి నిరసన తెలిపారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓటీటీలో సినిమా అందుబాటులోకి రావడంతో నెటిజన్లు భూతద్దం పెట్టి మరీ తప్పులను వెతుకుతున్నారు.కొన్ని సీన్లలో ప్రభాస్ బదులు బాడీ డబుల్ (డూప్) స్పష్టంగా కనిపిస్తున్నాడని, ఫేస్ స్వాప్ టెక్నాలజీ నాసిరకంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. "స్టార్ హీరోలకు డూప్ ఉండటం సహజమే.. కానీ ప్రేక్షకులకు తెలిసిపోయేలా చేయడం దారుణం" అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఒక సీన్‌లో ప్రభాస్ బస్సు ఎక్కేటప్పుడు గడ్డంతో ఉంటే.. బస్సు దిగేసరికి క్లీన్ ట్రిమ్ లో ఉండటం, పైగా బస్సు మోడల్ కూడా మారిపోవడం వంటి తప్పులను స్క్రీన్ షాట్స్ తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. 1960ల నాటి ఫ్లాష్ బ్యాక్ కథలో రూ. 500 కొత్త నోట్లు ఎలా వచ్చాయని, కోట్ల ఆస్తి ఉన్న హీరో హీరోయిన్ దగ్గర రూ. 3 లక్షలు దొంగిలించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మూడు నాలుగు జానర్లను మిక్స్ చేసి ప్రేక్షకులను దర్శకుడు కన్ఫ్యూజ్ చేశాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. సంజయ్ దత్, జరీనా వాహాబ్ పాత్రల వయస్సు, లాజిక్ గురించి మారుతిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్' సినిమాల కంటే కూడా మారుతిపైనే ఎక్కువ విమర్శలు రావడం గమనార్హం. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను దర్శకుడు సరిగ్గా వాడుకోలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే.. సినిమాపై ఇంత నెగిటివిటీ ఉన్నా, మొదటి రోజు జియో హాట్ స్టార్ సర్వర్లు స్లో అయ్యాయి. ప్రభాస్ మీద ఉన్న ప్రేమతో కొందరు చూస్తుంటే, మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి మెటీరియల్ వెతుక్కోవడం కోసమే సినిమాను వాచ్ చేస్తున్నారట. మొత్తానికి 'ది రాజాసాబ్' థియేటర్లలోనే కాదు.. డిజిటల్ తెరపై కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది.



Tags:    

Similar News