Nilakanta: ‘నీలకంఠగా వస్తున్న మాస్టర్ మహేంద్రన్… టీజర్‌తో పెరిగిన అంచనాలు

Nilakanta: రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించగా, స్నేహ ఉల్లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Update: 2025-12-18 05:58 GMT

Nilakanta: ‘నీలకంఠ’తో హీరోగా మహేంద్రన్… టీజర్‌తో పెరిగిన అంచనాలు

Nilakanta: ‘పెద్దరాయుడు’ సినిమాలో “నేను చూసాను తాతయ్య” అనే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన బాల నటుడు మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇటీవల విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రంలో యంగ్ విజయ్ సేతుపతిగా అద్భుతమైన నటనతో మెప్పించిన మహేంద్రన్, ఇప్పుడు ‘నీలకంఠ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.

రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించగా, స్నేహ ఉల్లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దేవి ఈ సినిమాను నిర్మించారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 2న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ‘నీలకంఠ’ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. అందులో భాగంగా తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రవణ్ అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, ప్రశాంత్ బీజే సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నతంగా కనిపిస్తున్నాయి. నైజాంలో ఈ సినిమాను గ్లోబల్ సినిమా ద్వారా విడుదల చేయనున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే ‘నీలకంఠ’తో మహేంద్రన్‌కు టాలీవుడ్‌లో మంచి హిట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Full View


కోట ప్రాంతాల్లో విస్తృతంగా షూటింగ్

‘నీలకంఠ’ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం కోట ప్రాంతాల్లో జరగడం విశేషం. నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు కోట పట్టణానికి చెందినవారు కావడంతో, ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతో సినిమా సుమారు 70 శాతం కోట, చిట్టమూరు, నాయుడుపేట ప్రాంతాల్లో చిత్రీకరించారు. శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో కబడ్డీ పోటీల సన్నివేశాలు తెరకెక్కించగా, తుపిలిపాలెం సముద్రం వద్ద గూడూరు కృష్ణ రాసిన ఐటమ్ సాంగ్‌ను స్నేహ ఉల్లాల్‌తో చిత్రీకరించారు. అదేవిధంగా నాయుడుపేట మండలం యాకసిరి గ్రామం, చిట్టమూరు, వాకాడు, ఓజిలి వంటి పలు ప్రాంతాల్లో కూడా షూటింగ్ నిర్వహించారు.

కోటకు చెందిన నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు

‘నీలకంఠ’ నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు కోటకు చెందినవారు కావడం మరో విశేషం. ఆయన తల్లిదండ్రులు శంకరయ్య, కౌశల్యమ్మ ఒకప్పుడు కోటలో ప్రసిద్ధి చెందిన శంకరయ్య హోటల్ యజమానులు. కోట ప్రజలకు సుపరిచితులైన ఈ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసులు, హైదరాబాద్‌లో బిల్డర్‌గా స్థిరపడి అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే ‘తీరం’ సినిమాను నిర్మించిన ఆయన, రెండో చిత్రంగా ‘నీలకంఠ’ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సందర్భంగా కోట ప్రజానీకం నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులుకు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News