Maargan Movie Review: క్షణక్షణం ఉత్కంఠ రేపే ట్విస్టులు.. అదిరిపోయిన విజయ్ ఆంటోనీ థ్రిల్లర్
Maargan Movie Review: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. ఇప్పుడు అలాంటి షార్ప్ థ్రిల్లర్‌తో మన ముందుకొచ్చారు మల్టీటాలెంటెడ్ విజయ్ ఆంటోనీ. ఆయనే హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ‘మార్గన్’ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది.
Maargan Movie Review: క్షణక్షణం ఉత్కంఠ రేపే ట్విస్టులు.. అదిరిపోయిన విజయ్ ఆంటోనీ థ్రిల్లర్
Maargan Movie Review: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. ఇప్పుడు అలాంటి షార్ప్ థ్రిల్లర్‌తో మన ముందుకొచ్చారు మల్టీటాలెంటెడ్ విజయ్ ఆంటోనీ. ఆయనే హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ‘మార్గన్’ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. లియో జాన్ పాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంతో విజయ్ ఆంటోనీ తన మేనల్లుడు అజయ్ ధీషన్‌ను పరిచయం చేశారు. మరి, ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ
సిటీలో రమ్య అనే అమ్మాయిని చాలా దారుణంగా హత్య చేస్తారు. ఆమెకు ఒక ఇంజక్షన్ ఇవ్వడంతో శరీరం మొత్తం నల్లగా మారి మృతి చెందుతుంది. ఇలాంటి ఒక విచిత్రమైన కేసును పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) సాల్వ్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా తొమ్మిదిన్నరేళ్ల క్రితం, తన కూతురు ప్రియను కూడా ఇలాగే దారుణంగా హత్య చేస్తారు. ఆ కేసును చేధించే ప్రయత్నంలో ధృవ శరీరం కూడా సగం నల్లగా మారిపోతుంది.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే తరహా హత్య జరగడంతో, ధృవ దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవరూ బలి కావొద్దని దృఢంగా నిశ్చయించుకుంటాడు. ఈ కేసు దర్యాప్తులో అరవింద్ (అజయ్ ధీషన్) అనే కుర్రాడిపై ధృవకు అనుమానం వస్తుంది. అయితే, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రియ శక్తులను చూసి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ కథలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల మిగతా పాత్రలేంటి. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? వాటి వెనుక కారణం ఏంటి? అన్నది సినిమా కథ.
సినిమా ఎలా సాగిందంటే?
'మార్గన్' సినిమా మొదలైన తీరు చూస్తే ఇది కూడా సాధారణ క్రైమ్ థ్రిల్లర్ లాగే ఉంటుందని అనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్ పడకముందే రమ్య హత్య ఎపిసోడ్‌తో దర్శకుడు కథలోని సీరియస్‌నెస్‌ను మనకు అర్థమయ్యేలా చూపించాడు. హీరో ధృవ కేసును చేపట్టిన వెంటనే, తన దగ్గరున్న ఆధారాలతో అరవింద్‌ను అనుమానితుడిగా గుర్తించి విచారణకు తీసుకురావడం చాలా వేగంగా జరుగుతుంది. అయితే, అక్కడి నుంచే కథలో ఒక కొత్త కోణం బయటపడుతుంది. ఇది రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ పంథాలో సాగే కథ కాదని అప్పుడు అర్థం అవుతుంది.
విచారణ క్రమంలో అరవింద్ పాత్రలోని అసాధారణ శక్తి సామర్థ్యాల గురించి హీరోకు అర్థం కావడం, ఆ తర్వాత అరవింద్ తన గతాన్ని వివరించడం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఈ క్రమంలో బయటపడే కొన్ని అంశాలు అప్పటిదాకా జరిగిన హత్యలతో అరవింద్‌కు సంబంధం ఉన్నట్లు అనిపించినా, ఇంటర్వెల్‌కు వచ్చేసరికి దీనిపై హీరోకు, ప్రేక్షకులకు ఒక స్పష్టత వస్తుంది. ఇది సెకండాఫ్ పై ఆసక్తిని మరింత పెంచుతుంది. విరామ తర్వాత థ్రిల్‌కు తగ్గట్లుగానే సెకండాఫ్ కూడా ఎంతో ఉత్కంఠగా మొదలవుతుంది. హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేగం పుంజుకున్నప్పటి నుంచి కథనం మరింత పట్టు బిగిస్తుంది. చివరి వరకు సస్పెన్స్ ను బాగా మెయింటెయిన్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. హంతకులు ఎవరన్నది ప్రేక్షకులు ఊహించలేనంతగా ట్విస్టులుంటాయి.
ఎవరెలా చేశారంటే...
ఈ తరహా కథలు విజయ్ ఆంటోనీకి కొట్టిన పిండి. పోలీస్ ఆఫీసర్ పాత్రకు తగ్గట్లుగా, సీరియస్‌గా, ఇంటెన్స్ లుక్‌లో అద్భుతంగా నటించారు. ఆయన నటన సినిమాకు ప్రధాన బలం. ఈ సినిమాలో అజయ్ ధీషన్ పాత్ర కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. మొదట్లో సైకో కిల్లర్ లా నెగెటివ్ షేడ్స్‌లో కనిపించినా, సెకండాఫ్ కు వచ్చేసరికి ఒక మినీ సూపర్ హీరోలా అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. విజయ్‌కి సాయపడే పోలీస్‌గా బ్రిగిడ నటన చాలా బాగుంది. ప్రీతిక, వినోద్ సాగర్, దీప్సిక, వెన్నెల, మేఘల పాత్రధారుల నటన కూడా చాలా బాగుంది. అందరూ తమ పరిధి మేరకు చక్కగా నటించి సినిమాను ముందుకు నడిపారు.
దర్శకుడు లియో జాన్ పాల్ కథను మొదలుపెట్టిన తీరు చాలా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను నిలబెట్టి, ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి బాగా కృషి చేశారు. విజయ్ ఆంటోనీ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథకు అదనపు బలాన్ని చేకూర్చింది. ఉత్కంఠను పెంచడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఫోటోగ్రఫీ బాగుంది. థ్రిల్లర్ మూడ్‍కు తగ్గట్టు విజువల్స్ అదిరిపోయాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా చాలా క్వాలిటీగా ఉన్నాయి.
బలాలు:
కథాంశం చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. అజయ్ ధీషన్ పోషించిన అరవింద్ పాత్ర సినిమాకు పెద్ద హైలైట్. సినిమా నిండా ఉత్కంఠ రేపే సన్నివేశాలు, మలుపులు ఉన్నాయి. విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్, సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్. అలాగే సినిమా నిడివి తక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టదు.
చివరిగా
ఓటీటీలో రెగ్యులర్‌గా ఇలాంటి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి కూడా 'మార్గన్' ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నిడివి తక్కువగా ఉండి, ఉత్కంఠగా సాగే ఈ థ్రిల్లర్ డ్రామాను ఒకసారి థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది తప్పకుండా ప్రేక్షకులను నిరాశపరచదు. పైగా కొత్త అనుభూతినిస్తుంది.
రేటింగ్: 3/5