Jabardasth Mahidhar: పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ మహిధర్... ఆరేళ్ల ప్రేమ.. ఏడడుగుల బంధం! వధువు ఎవరంటే?
Jabardasth Mahidhar: తాజాగా మహిధర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చంద్రకళ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
Jabardasth Mahidhar: పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ మహిధర్... ఆరేళ్ల ప్రేమ.. ఏడడుగుల బంధం! వధువు ఎవరంటే?
Jabardasth Mahidhar: హాస్యంతో పాటు టాలెంట్‌కు వేదికగా నిలిచిన ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎంతోమంది యువత బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మహిధర్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మహిధర్, తరువాత రైటర్‌గా, టీమ్ లీడర్‌గా ఎదిగి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
కొంతకాలం క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన మహిధర్ ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సినిమా, బిగ్‌బాస్ రివ్యూలు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఓ కేఫ్ బిజినెస్ కూడా నిర్వహిస్తూ బిజినెస్ పరంగా కూడా ముందుకెళ్తున్నారు. ఆయన వీడియోలకు భారీగా వ్యూస్ వస్తుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇదిలా ఉండగా తాజాగా మహిధర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చంద్రకళ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం విశాఖపట్నంలో ఘనంగా జరిగినట్లు సమాచారం. మహిధర్ భార్య చంద్రకళ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, జబర్దస్త్ నటులు మహిధర్–చంద్రకళ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా ఇది ప్రేమ వివాహమే అని మహిధరే స్వయంగా వెల్లడించారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. చంద్రకళ రాజమండ్రికి చెందిన యువతి కాగా, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని మహిధర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
‘చంద్రకళ నా యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్. ఆమె మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసింది. నా వీడియోలను ఇష్టపడుతూ కాంప్లిమెంట్స్ ఇచ్చేది. తర్వాత మేమిద్దరం కలుసుకోవడం, మాట్లాడుకోవడం మొదలైంది. 2019 నుంచి ప్రేమలో ఉన్నాం. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నాం’ అని మహిధర్ వెల్లడించారు.
మొత్తానికి ఆరేళ్ల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన మహిధర్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.