HIT 3 Box Office Collection Day 1: కుమ్మేస్తున్న హిట్3.. తొలి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డు..!
నాని హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
HIT 3 Collections: కుమ్మేస్తున్న హిట్3.. తొలి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డు
HIT 3 Box Office Collection Day 1: నాని హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాస్త వయలెన్స్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా మాస్ ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా వసూళ్లలో కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.18 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి (HIT 3 First day collections). నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.
ఇక ఈ సినిమా విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. ప్రీ బుకింగ్స్‌లోనే హవా చూపించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతోంది. ఓవర్సీస్‌లో తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ వారాంతంలోనే రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మై షో’లోనూ ‘హిట్: ది థర్డ్ కేస్’ రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో 2.72లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. నాని కెరీర్‌లో ఒక్కరోజే ఇన్ని టికెట్స్ సేల్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
సినిమా కథేంటంటే.?
అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదేతరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనక ఓ పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బిహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేసు కొలిక్కి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదిలీ అవుతాడు. అక్కడికి వచ్చాక కూడా ఈ కేస్‌ని ఛేదించేందుకు ఏం చేశాడు? వరుసగా జరుగుతున్న ఈ హత్యల వెనక దాగిన మిస్టరీ ఏంటి.? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.