Hari Hara Veera Mallu: మొత్తం క్రిష్ తీసి ఉంటే…
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన హరిహర వీరమల్లు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందన్నది స్పష్టమవుతోంది.
మొత్తం క్రిష్ తీసి ఉంటే…
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన హరిహర వీరమల్లు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందన్నది స్పష్టమవుతోంది. ప్రథమార్ధం వరకు ఆసక్తికరంగా సాగిన కథ, ద్వితీయార్ధంలో మాత్రం గాడి తప్పిందని మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం.
ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఉత్సుకత రేకెత్తించినా, తర్వాత కోహినూర్ వజ్రం కోసం హీరో జర్నీని రేసీగా చూపిస్తారని అనుకున్న ప్రేక్షకులు నిరాశ చెందారు. ఢిల్లీ ట్రావెల్, మధ్యలో ధర్మ పరిరక్షకుడిగా హీరో మరో కోణం… ఇవన్నీ కథను డీవియేట్ చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివర్లో తుపాను ఎపిసోడ్‌తో హడావుడిగా ముగించేసి, ఔరంగజేబ్ పోరాటం, కోహినూర్ వజ్రం సస్పెన్స్ అన్నీ పార్ట్-2కే వదిలేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమాలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకున్న సన్నివేశాలకు మాత్రం క్రిష్‌కే క్రెడిట్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ప్రథమార్ధంలోని ఎక్కువ సన్నివేశాలు క్రిష్ దర్శకత్వంలోనే తీశారని, అవి విజువల్ ఎఫెక్ట్స్ తక్కువగా, కథా నడక సజావుగా ఉండటంతో బాగున్నాయని అంటున్నారు.
కానీ ద్వితీయార్ధం మాత్రం పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్, బోరింగ్ సీన్లు, కథను పక్కదారి పట్టించే సన్నివేశాలతో నిరాశపరిచిందని, దీనికి జ్యోతికృష్ణకే బాధ్యత వహించాల్సి ఉంటుందని నిర్మాత రత్నమే స్పష్టం చేశాడు.
క్రిష్ మొత్తం సినిమా దర్శకత్వం వహించి ఉండి ఉంటే ఔట్‌పుట్ పూర్తిగా వేరుగా ఉండేదని, ఆయన ధర్మ పరిరక్షణ ట్రాక్ కత్తిరించి, కోహినూర్ వజ్రం టాస్క్‌పై కథను ఉత్కంఠభరితంగా నడిపించి, ద్వితీయార్ధాన్ని కూడా రేసీగా తీర్చిదిద్దేవారని సినీప్రియులు కామెంట్ చేస్తున్నారు.