Chhichhore Movie Actor: సుశాంత్ సహ నటి అభిలాషా పాటిల్ కరోనాతో మృతి
Chhichhore Movie Actor: 'చిచోరే' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించిన అభిలాషా పాటిల్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు
Chhichhore Movie Actor:(File Image)
Chhichhore Movie Actor: కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను కబళిస్తోంది. ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో కరోనా మార్క్ ఆక్రందనలు వినిపిస్తున్నాయి. ఈ మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టడం లేదు. తాజాగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'చిచోరే' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించిన అభిలాషా పాటిల్(40) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.
'చిచోరే'తో పాటు బాలీవుడ్‌లో 'బద్రీనాధ్‌కి దుల్హనియా', 'గుడ్‌న్యూస్' చిత్రాల్లో అభిలాషా నటించింది. దీంతో పాటు మరాఠీలో కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది. అయితే షూటింగ్ కోసం బెనారస్ వెళ్లిన ఆమెకు ముంబై తిరిగి వచ్చిన తర్వాత కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించడంతో.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అభిలాషా మృతితో ఆమె సహ నటీనటులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
అభిలాషాతో 'బాప్‌మనూస్' అనే సీరియల్ నటించిన సంజయ్ కులకర్ణీ.. కరోనాతోఆమె మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ''ఇది నిజంగా చాలా బాధకరమైన వార్త. ఆమె తన కెరీర్‌లో ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. కానీ, ఈలోపే ఇలా జరగడం నిజంగా బాధాకరం. ఆమె మంచి మనస్సు ఉన్న వ్యక్తి'' అని సంజయ్ అన్నారు. ఆయనతో పాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు అభిలాషా మృతి సంతాపం తెలిపారు.