Tollywood Heroes: తెలుగు హీరోలకి జై కొడుతున్న బాలీవుడ్..
తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ నిర్మాతలకు ఒక మంచి అవకాశంలా కనిపిస్తోంది. అందుకు కారణం హిందీలో హీరోల రెమ్యూనరేషన్స్‌కి తగ్గట్టుగా థియేటర్‌లో వసూళ్లు రావడంలేదు.
తెలుగు హీరోలకి జై కొడుతున్న బాలీవుడ్..
Tollywood Heroes: ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా తక్కువగా చూసేవారు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగును పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. పూర్తిగా మారిపోయాయి.
తెలుగు సినిమాలు మంచి కలెక్షన్లు సాధించడంతో ఇప్పుడు మన హీరోల క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ నిర్మాతలకు ఒక మంచి అవకాశంలా కనిపిస్తోంది. అందుకు కారణం హిందీలో హీరోల రెమ్యూనరేషన్స్‌కి తగ్గట్టుగా థియేటర్‌లో వసూళ్లు రావడంలేదు. ఇక తెలుగు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తూ ఉండడం బాలీవుడ్ నిర్మాతలను సైతం ఆకర్షిస్తోంది. అందుకే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తెలుగులో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్ సినిమాకు దర్శకత్వం వహించిన నగేష్ భట్‌తో తెలుగు సినిమా చేయాలనే యోచనలో కరణ్ జోహార్ ఉన్నట్టు సమాచారం. గతంలో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ స్థానంలో రామ్ చరణ్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
తెలుగులో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలనుకుంటన్నారు కరణ్ జోహార్. సినిమా నిర్మాణ వ్యయం, మార్కెట్ దృష్టిలో ఉంచుకుని తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లకు హీరోల డేట్లు దొరకడం కష్టం అవుతోంది. ఇక హిందీ ఇండస్ట్రీ వాళ్లు కూడా మన తెలుగు హీరోల కోసం చూస్తుంటే హీరోల డేట్లు దొరకడం మరింత కష్టమయ్యేలా కనిపిస్తోంది.
ఇక తమిళంలోనూ మన తెలుగు నిర్మాతలే అక్కడి హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు హిందీ నిర్మాతలు సైతం తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. ఒక రకంగా ఇది మన హీరోలకి గోల్డెన్ టైం అని చెప్పొచ్చు.