Bigg Boss 9 : బిగ్ బాస్ 9లో హై-వోల్టేజ్ డ్రామా.. రెబల్స్ ఎవరు? కెప్టెన్సీ టాస్క్‌లో బిగ్ బాస్ సీక్రెట్ ప్లాన్!

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఊహించని పరిణామాలు, ఎమోషన్స్, గొడవలు, అరుపుల మధ్య ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభిస్తోంది.

Update: 2025-11-06 06:06 GMT

Bigg Boss 9 : బిగ్ బాస్ 9లో హై-వోల్టేజ్ డ్రామా.. రెబల్స్ ఎవరు? కెప్టెన్సీ టాస్క్‌లో బిగ్ బాస్ సీక్రెట్ ప్లాన్!

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఊహించని పరిణామాలు, ఎమోషన్స్, గొడవలు, అరుపుల మధ్య ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ప్రతి వారం ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత వారం దివ్వెల మాధురి అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ వారం ఎలిమినేషన్ రగడ ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు ఇంటి సభ్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఈసారి బిగ్ బాస్ ఎప్పటిలా కాకుండా, హౌస్‌మేట్స్‌ను మూడు టీమ్‌లుగా విభజించి, వారి మధ్యలో ఇద్దరు రెబల్స్ ను పెట్టి సీక్రెట్ టాస్కులు ఇస్తూ షోను మరింత రంజుగా మార్చారు.

ఈ తొమ్మిదో వారంలో తనూజ, కల్యాణ్, భరణి, సుమన్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, సంజన నామినేషన్ల జాబితాలో ఉన్నారు. అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన సాయి శ్రీనివాస్ ఓటింగ్‌లో వెనుకబడి ఉండటం, హౌస్‌లో చురుకుగా లేకపోవడం వల్ల ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ చివరి స్థానాల్లో ఉన్నారు. నామినేషన్ల రగడ ముగిసిన తరువాత, నామినేషన్స్ సమయంలో గొడవపడిన ఇమ్మాన్యుయేల్, తనూజ ఒకరికొకరు సారీ చెప్పుకుని సమస్యను పరిష్కరించుకున్నారు.

సాధారణ టాస్క్‌లకు భిన్నంగా, బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ పోటీని వెరైటీగా ప్లాన్ చేశారు. గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ పెట్టిన టెలిఫోన్‌ను చూసి హౌస్‌మేట్స్ ఆశ్చర్యపోయారు. మొదట ఫోన్ ఎత్తిన తనూజకు బిగ్ బాస్.. ఇప్పటి నుంచి కంటెండర్‌షిప్ టాస్క్ మొదలైంది అని చెప్పి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులను మూడు టీములుగా విభజించారు. ఆరెంజ్ టీమ్ లో ఇమ్మాన్యుయేల్, తనూజ, గౌరవ్, రాము, బ్లూ టీమ్ - డీమోన్, రీతూ, భరణి, నిఖిల్, పింక్ టీమ్ - కల్యాణ్, సుమన్, దివ్య, సాయి. ఈ టాస్క్‌లలో గెలిచిన టీమ్ ఒక సేఫ్టీ కార్డు పొందుతుంది. ఆ కార్డు ద్వారా తమ టీమ్‌లోని ఒక సభ్యుడిని రెబల్‌గా ప్రకటించి, ఎలిమినేషన్ నుంచి కాపాడుకోగలుగుతారు. సంజనను కంటెండర్ టాస్క్ నుంచి తప్పించారు.

బిగ్ బాస్ ఈ ఆటలో ప్రధాన ట్విస్ట్ ఇస్తూ, ఇద్దరు సభ్యులను సీక్రెట్ రెబల్స్ గా నియమించారు. మొదట, బిగ్ బాస్ ఫోన్‌లో మాట్లాడుతూ సుమన్ శెట్టిని మొదటి రెబల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత, దివ్యను రెండవ రెబల్‌గా నియమించారు. ఈ ఇద్దరు రెబల్స్‌కు బిగ్ బాస్ చిట్స్ ద్వారా సీక్రెట్ టాస్క్‌లు ఇచ్చారు. అవి విజయవంతంగా పూర్తి చేస్తే, వారు కంటెండర్స్ అయ్యే అవకాశం పొందడమే కాకుండా, మరొకరిని పోటీ నుంచి తొలగించే అధికారాన్ని పొందుతారు. సుమన్, దివ్య కలిసి చేసిన మొదటి టాస్క్ ముగ్గురు హౌస్‌మేట్స్‌ను వారి స్థానం నుంచి లేపి, ఆ స్థానంలో వీరు కూర్చోవడం. ఈ టాస్క్‌ను వారు విజయవంతంగా పూర్తి చేశారు.

రెబల్స్ తమ మొదటి సీక్రెట్ టాస్క్‌ను గెలవడంతో, వారికి ఒకరిని పోటీ నుంచి తప్పించే అధికారం వచ్చింది. రెబల్స్ దివ్య, సుమన్ కలిసి కల్యాణ్‌ను కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తున్నట్లు బిగ్ బాస్‌కు సీక్రెట్‌గా తెలిపారు. కొద్దిసేపటికే బిగ్ బాస్ ఫోన్ చేసి కల్యాణ్‌కు ఈ షాకింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. టీమ్‌లకు పెట్టిన బ్యాలెన్సింగ్ టాస్క్‌లో ఆరెంజ్ టీమ్ నుంచి రాము-ఇమ్మూ గెలిచి సేఫ్టీ కార్డు పొందారు. ఆ టీమ్ ఆ కార్డును ఇమ్మూకు ఇచ్చింది.

రెబల్స్ దివ్య, సుమన్‌లకు రెండో సీక్రెట్ టాస్క్ వచ్చింది. ఎవరూ చూడకుండా ఒక ఫుల్ టెట్రా ప్యాక్ పాలు తాగి, మిగతా పాల ప్యాకెట్లను ఫ్రిడ్జ్ నుంచి తీసి స్టోర్ రూమ్‌లో పెట్టాలి. అర్ధరాత్రి 3 గంటల సమయంలో, సుమన్ ఎవరూ చూడకుండా ఈ టాస్క్‌ను పూర్తి చేసి, మిగిలిన హౌస్‌మేట్స్‌కు షాక్ ఇచ్చేలా రెండో సీక్రెట్ టాస్క్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. అలాగే ఘోస్ట్ రూమ్ కంటెస్టెంట్స్‌కు ఊహించని భయాన్ని కలిగించింది. ఈ టాస్క్‌లో సభ్యులు చీకట్లో వస్తువులను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఘోస్ట్ రూమ్‌లో ఇంటి సభ్యుల భయాలు, ఆశ్చర్యకరమైన రెబల్స్ సీక్రెట్ టాస్క్ హౌస్‌లో సరికొత్త సస్పెన్స్‌ను సృష్టించింది. హౌస్‌మేట్స్ భయంతో వణికిపోగా, ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత వినోదం దొరికింది.

Tags:    

Similar News