Actress: మర్డర్ కేసులో అందాల తార.. అసలేం జరిగిందంటే
Nusraat Faria: బంగ్లాదేశ్‌కి చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియా ఓ హత్య కేసులో అరెస్టయ్యారు.
Actress: మర్డర్ కేసులో అందాల తార.. అసలేం జరిగిందంటే
Nusraat Faria: బంగ్లాదేశ్‌కి చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియా ఓ హత్య కేసులో అరెస్టయ్యారు. తాజాగా ఆమె థాయ్‌లాండ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, ఢాకాలోని షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ వద్ద ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారంతో ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం వ్యతిరేక అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నటి నుస్రత్ ఫరియాతోపాటు మొత్తం 17 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఈ ఘటన తరువాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అనేక రాజకీయ నాయకులపై కేసులు నమోదవడం, ప్రభుత్వం అస్థిరతకు లోనవడం, హసీనా భారతదేశంలో తలదాచుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నటి అరెస్టుకు సంబంధించి పోలీస్ అధికారి సుజన్ హక్ మాట్లాడుతూ, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో తమ బృందం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కోర్టు ఆమెపై హత్యాయత్నం అభియోగాన్ని సమర్థించిందని, పతరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని వివరించారు.
అరెస్టు అనంతరం ఫరియాను వతారా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినా, అనంతరం ఆమెను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయానికి తరలించినట్టు ప్రోథోమ్ అలో మీడియా పేర్కొంది.
నటి ఫరియా 2015లో విడుదలైన ‘ఆషికి’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో ఆమె అంకుష్ హజ్రా సరసన నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అనంతరం ఆమె ‘హీరో 420’ (2016), ‘బాద్షా – ది డాన్’ (2016), ‘ప్రేమి ఓ ప్రేమి’ (2017), ‘బాస్ 2: బ్యాక్ టు రూల్’ (2017) వంటి వరుస హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.
2023లో నుస్రత్ ఫరియా బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ సినిమాలో షేక్ హసీనా పాత్రను పోషించారు. భారత దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారతదేశం – బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో అరిఫిన్ షువో టైటిల్ పాత్ర పోషించారు.