Balakrishna: బాల‌య్యా మ‌జాకా.. రోజుకు రూ. 2.5 కోట్ల రెమ్యున‌రేష‌న్‌.?

ఇంతవరకూ బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో పూర్తిగా తెలుగులోనే సినిమాలు చేశారు.

Update: 2025-05-12 14:30 GMT

Balakrishna: బాల‌య్యా మ‌జాకా.. రోజుకు రూ. 2.5 కోట్ల రెమ్యున‌రేష‌న్‌.?

Balakrishna: న‌ట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌లో ఊపుమీదున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఆయన, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దసరా లేదా దీపావళి సీజన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాతి ప్రాజెక్టుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

ఇంతవరకూ బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో పూర్తిగా తెలుగులోనే సినిమాలు చేశారు. తమిళనాడు కేంద్రంగా తన బాల్యం గడిపినా, తమిళ భాషపై ప్రావీణ్యం ఉన్నా, కోలీవుడ్‌కి మాత్రం ఎప్పుడూ దూరంగా ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి ఆయన సమకాలీనులు ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకున్నా, బాలయ్య మాత్రం టాలీవుడ్‌కే పరిమితమయ్యారు. హిందీలో నటించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు.

ఇక తాజాగా, కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన జైలర్ 2లో బాలయ్య నటించబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. మొదటి భాగం డైరెక్టర్ నెల్సన్ దిల్‌కుమార్ దృష్టిని ఆకర్షించగా, మలయాళ నటుడు మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్‌లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే తరహాలో స్టార్ గెస్ట్‌లను తీసుకురావాలని నిర్ణయించిన నెల్సన్, బాలయ్యను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గతంలోనే బాలయ్యను జైలర్ 1లోకి తీసుకురావాలని ప్రయత్నించినా, అది కార్యరూపం దాల్చలేదు.

తాజా సమాచారం ప్రకారం, బాలయ్యకు జైలర్ 2 కోసం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ఓ ప్రత్యేక పాత్రను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కీ రోల్‌లో నటిస్తారా లేదా గెస్ట్ అప్పియరెన్సేనా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. బాలయ్య పాత్రపై భారీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, బాలయ్య ఈ సినిమా కోసం 20 రోజుల కాలం కేటాయించనున్నారని, రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం. ఇప్పటివరకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ రూ.20 నుంచి 30 కోట్ల మధ్యే ఉండేది. గెస్ట్ రోల్‌కే ఈ స్థాయిలో ఫీ తీసుకోవడం ఆయన స్టార్డమ్‌ను మరోసారి రుజువు చేస్తోంది.

Tags:    

Similar News