Anaganaga Review: విద్యా వ్యవస్థను ప్రశ్నించే అనగనగా.. సినిమా ఎలా ఉందంటే..?
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది.
Movie: విద్యా వ్యవస్థను ప్రశ్నించే అనగనగా.. సినిమా ఎలా ఉందంటే
Anaganaga Review: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది. ప్రతీ వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్ తాజాగా మరో ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేస్తూ, భావోద్వేగాలకు హత్తుకునే కథతో తెరకెక్కిన అనగనగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే
వ్యాస్ (సుమంత్) ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్. పిల్లలు ర్యాంకుల వెనక పరుగులు పెట్టడం వల్ల జీవిత పరాజయాలు ఎదుర్కొంటారని అతడి నమ్మకం. కథల రూపంలో పాఠాలు చెబితేనే అవి పిల్లలకు అర్థమవుతాయని భావిస్తాడు.
అతడి భార్య భాగ్య (కాజల్ చౌదరి) అదే స్కూల్ ప్రిన్సిపల్. వ్యాస్ విధానాలకు మేనేజ్‌మెంట్ వ్యతిరేకంగా ఉండటంతో చివరికి అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. పిల్లల్లోని నిజమైన సామర్థ్యాన్ని బయటకి తీసేందుకు వ్యాస్ ఎంచుకున్న మార్గం ఏమిటి? అతడి ప్రయాణం ఎటు దారితీసిందన్నదే సినిమా కథ.
సినిమా ఎలా ఉంది.?
నేటి విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంతటి ఒత్తిడి పెడుతుందో ఈ సినిమా స్పష్టంగా చూపిస్తుంది. చిన్నారులపై తల్లిదండ్రులు, స్కూల్‌లు వేసే అంచనాలు, ఫలితాల రేసు... ఇవన్నీ పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపుతున్న వాస్తవాలను ఫీలింగ్‌తో వివరించారు.
ప్రథమార్ధం అంతా స్కూల్‌లో పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడిపై ఉంటే, విరామానికి ముందు వచ్చే ట్విస్ట్ ఆసక్తి రేపుతుంది. ద్వితీయార్థం తండ్రి-కొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. అయితే కొన్నిచోట్ల కథ నెమ్మదించి సాగుతుంది. ఎడ్యుఫెస్ట్‌లో వ్యాస్ కొడుకు చెప్పే కథతో సినిమా గుండెకు హత్తుకునే ముగింపుకు చేరుతుంది.
ఎలా నటించారు.?
సుమంత్ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్రకు న్యాయం చేశాడు. కాజల్ చౌదరి ప్రిన్సిపల్ పాత్రలో మెప్పించింది. మాస్టర్ విహర్ష్ నటన ముఖ్యంగా క్లోజింగ్ సీన్లలో హైలైట్. అవసరాల శ్రీనివాస్, అను హాసన్, ఇతర నటులు తమ పాత్రమేరకు నటించారు.
సాంకేతిక విలువలు:
చందు రవి సంగీతం, పవన్ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అన్నీ సినిమా బలాన్ని పెంచాయి. ఎడిటింగ్ ద్వితీయార్థంలో కొద్దిగా తక్కువ ఫీల్ ఇచ్చినా, మొత్తం మీద ప్రెజెంటేషన్ ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు సన్నీ సంజయ్ కథ ఎంపిక, దాన్ని చెప్పిన తీరు ప్రశంసనీయం.
బలాలు:
సుమంత్ నటన
కథనశైలి, ఎమోషనల్ డెప్త్
సాంకేతిక విలువలు
బలహీనతలు:
– ద్వితీయార్థం కాస్త నెమ్మదించడంవల్ల పేస్ తగ్గడం
– కొన్ని సన్నివేశాల్లో లెంత్ ఎక్కువగా అనిపించడం