అక్కడి నుంచే అఖండ 3 ఆరంభం: బోయపాటి శ్రీను క్లారిటీ
ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2’ ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్కడి నుంచే అఖండ 3 ఆరంభం: బోయపాటి శ్రీను క్లారిటీ
ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2’ ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. గతంలో సంచలన విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా 3D హంగులతో రూపొందిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బోయపాటి శ్రీను పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అఖండ 3పై క్లారిటీ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచారు.
మీడియా సమావేశంలో భాగంగా, “శివుడు నేపథ్యంలో వచ్చిన సినిమాలకు గతంలో విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మీ సినిమాకు కూడా అలాంటి భయం ఉందా?” అని ప్రశ్నించగా బోయపాటి స్పందిస్తూ,
“ఇది శివుడిపై నేరుగా తీసిన సినిమా కాదు. శివ భక్తుడైన అఘోర కథ మాత్రమే. ఈ విషయాన్ని అఖండ తల్లి – శివుడి ఎపిసోడ్ ద్వారా స్పష్టంగా చెప్పాం. గతంలో ఏదైనా జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి సినిమా మంచి ముహూర్తంతోనే మొదలవుతుంది. కానీ ప్రతి సినిమా హిట్ అవుతుందా? కాదు. మంచి పని చేస్తే అడ్డంకులు రావడం సహజం. అలాంటి సమయంలో సంకల్ప బలం ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొగలం” అంటూ వివరించారు.
ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 3 గురించి మాట్లాడుతూ బోయపాటి శ్రీను కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఈ సినిమా అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉన్న కథ. అవెంజర్స్ అన్నవి రచయితలు సృష్టించిన సూపర్ హీరోలు. కానీ మన భారతీయ సంస్కృతిలో నిజమైన సూపర్ హీరోలు ఉన్నారు. అధర్వణ వేదం నుంచి ఆయుధాలతో కూడిన యోధ సంస్కృతి మనది. కురుక్షేత్రంలోనే ఎన్నో ఊహకందని ఆయుధాలు వాడారు. అక్కడి నుంచే ఎన్నో కథలు, ఎన్నో సూపర్ హీరోలను తీసుకోవచ్చు. మనకు కావాల్సింది సంకల్పం, ఓపిక మాత్రమే” అని తెలిపారు.
అలాగే సీక్వెల్స్ విషయంలోనూ ఆయన స్పష్టత ఇచ్చారు.
“ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంట వెంటనే సీక్వెల్స్ తీస్తే బోర్ వస్తుంది. అందుకే రెండు, మూడు సినిమాల గ్యాప్ తీసుకొని మళ్లీ వస్తాను” అన్నారు.
ముఖ్యంగా అఖండ 2 క్లైమాక్స్‌లో చూపించిన శంభాల ద్వారాలు తెరుచుకునే సన్నివేశం నుంచే అఖండ 3 కథ ప్రారంభమవుతుంది అని చెప్పడం విశేషం. దీంతో అఖండ 3 ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్న సందేహానికి బోయపాటి పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చారు.
ఇక తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ,
“నాకు అన్ని జానర్లలో సినిమాలు చేయాలనే కోరిక ఉంది. ప్రతి ప్రాజెక్ట్ పక్కాగా ప్లాన్ చేసిన తర్వాతే ప్రకటిస్తాను. నా తదుపరి సినిమా వివరాలను మరో 10 రోజుల్లో వెల్లడిస్తాను” అంటూ అభిమానులకు ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.
మొత్తానికి, అఖండ 2 తర్వాత అఖండ 3పై బోయపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.