‘అఖండ 2’ ఓపెనింగ్స్ సంచలనం.. బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి ఆ రికార్డు!
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అఖండ 2: తాండవం’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది.
‘అఖండ 2’ ఓపెనింగ్స్ సంచలనం.. బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి ఆ రికార్డు!
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అఖండ 2: తాండవం’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి ముందురోజు డిసెంబర్ 11 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ కూడా నిర్వహించారు.
బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’ కు సీక్వెల్‌గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీకి తొలిరోజే అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తొలిరోజు వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. స్పెషల్ పోస్టర్ ద్వారా రివీల్ చేసిన గణాంకాల ప్రకారం, ‘అఖండ 2’ ప్రీమియర్స్‌తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.59.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ఈ వసూళ్లతో ‘అఖండ 2’ ఒక అరుదైన ఘనతను అందుకుంది. బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇది బాలకృష్ణ అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించే విషయం. ఇక రెండో రోజు నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా కొనసాగుతున్నట్లు సమాచారం. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమా విషయానికొస్తే.. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి భారీ విజయాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘అఖండ 2: తాండవం’ కూడా చేరింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు.
విలన్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకోగా, జగపతిబాబు, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీని సి. రామ్ ప్రసాద్, ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహించారు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి ప్రెజెంటర్‌గా ఉన్నారు.
ఇక ఈ ఊపు కొనసాగితే, రాబోయే రోజుల్లో ‘అఖండ 2’ ఓవరాల్ కలెక్షన్స్ ఎక్కడి వరకు చేరుతాయో చూడాల్సిందే.