Actress: కాజల్‌, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే

పుదుచ్చేరిలో చోటుచేసుకున్న క్రిప్టో కరెన్సీ మోసంలో సినీ తారలు తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.

Update: 2025-02-28 03:46 GMT

పుదుచ్చేరిలో చోటుచేసుకున్న క్రిప్టో కరెన్సీ మోసంలో సినీ తారలు తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మోసపూరితంగా పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఏంటా మోసం.? దీనికి సినీతారలకు సంబంధం ఏంటన్న వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

2022లో కోయంబత్తూరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రారంభమైన ఓ క్రిప్టో కరెన్సీ కంపెనీ, పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఈ వాగ్దానాలకు ఆకర్షితులైన పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు రూ.2.40 కోట్లు వసూలు చేసినట్లు అశోకన్‌ అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కోయంబత్తూరులో ఘనంగా నిర్వహించారు. సినీ నటి తమన్నా సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే, మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన మరో కార్యక్రమానికి నటి కాజల్‌ అగర్వాల్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా కంపెనీ విశ్వసనీయతను పెంచి, మరింత మందిని ఆకర్షించారు. ఆ తర్వాత ముంబయిలో భారీ పార్టీ నిర్వహించి, వేలాది మంది నుంచి పెట్టుబడిగా డబ్బు సేకరించారు. ఈ మోసానికి సంబంధించి నితీష్‌ జెయిన్‌ (36), అరవింద్‌ కుమార్‌ (40)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశముంది. క్రిప్టో కరెన్సీ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాలు పొందుతామన్న ఆశతో ఇలాంటి పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News