Maruva Tarama Review: మరువ తరమా.. యూత్‌కి కనెక్ట్ అయ్యే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ..!

Maruva Tarama Review: ప్రేమ ఇష్క్ కాదల్ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హరీష్ ధనుంజయ్ తాజా చిత్రం మరువ తరమా.

Update: 2025-11-28 06:07 GMT

Maruva Tarama Review: ప్రేమ ఇష్క్ కాదల్ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హరీష్ ధనుంజయ్ తాజా చిత్రం మరువ తరమా. పేరుకు తగ్గట్టుగానే ఇది మర్చిపోలేని ప్రేమకథ అనే భావనను ట్రైలర్ నుంచే కలిగించింది. అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామాకు, RX100 లాంటి సినిమాలకు పాటలు రాసిన చైతన్య వర్మ నదింపల్లి దర్శకత్వం వహించడం ఆసక్తిని పెంచింది. గురువారం ప్రీమియర్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, నేటి యువతరం ప్రేమ బంధాలను, వారి మానసిక సంఘర్షణను ఎంతవరకు పట్టుకోగలిగిందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ

ఒకే ఆఫీసులో పనిచేసే ముగ్గురు యువకులు - రిషి (హరీష్ ధనుంజయ్), సింధు (అవంతిక), అన్వి (అతుల్య చంద్ర). రిషి, సింధును చూడగానే ప్రేమలో పడతాడు. అయితే రిషిపై గాఢమైన ప్రేమ ఉన్నా, అతని మనసు సింధు వైపు ఉందని గ్రహించి తన ప్రేమను త్యాగం చేసే పాత్రలో అన్వి కనిపిస్తుంది. సింధుపై ఇంత ప్రేమ ఉన్న రిషి.. ఆమెతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఆ బ్రేకప్ తర్వాత తిరిగి సింధు వైపు రావడానికి కారణాలేంటి? ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో అన్వి పాత్ర ఎలా ముగిసింది? ఈ కథలో రిషి తల్లి (రోహిణి) పాత్ర ఇచ్చే కీలకం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

దర్శకుడి ప్రతిభ

ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ విషయంలో దర్శకుడు చైతన్య వర్మ పక్కా ప్లాన్‌తో వచ్చి సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడానికి కొంత సమయం తీసుకుంటుంది. కథలో పెద్దగా మలుపులు లేకపోయినా, దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్లు, స్నేహితుల మధ్య వచ్చే పంచ్ డైలాగ్స్‌తో ఎక్కడా విసుగు అనిపించకుండా సింపుల్ గా నడిపించాడు. పాటలు సందర్భోచితంగా వచ్చిపోతాయి. సినిమా అసలు బలం సెకండాఫ్‌లో కనిపిస్తుంది. దర్శకుడు భావోద్వేగాలు, కథా పరంగా పట్టు సాధించాడు. రియల్ లైఫ్ సంఘటనలకు దగ్గరగా ఉండే కథనం కారణంగా, తెరపై పాత్రలు తమ బాధను వ్యక్తం చేస్తుంటే, ప్రేక్షకులకు కూడా తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి. ఈ ఎమోషనల్ కనెక్టివిటీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఒక సన్నివేశంలో తల్లి పాత్ర (రోహిణి) చెప్పే “అనుకున్నట్టే జరిగితే, దాన్ని ప్రేమ అని ఎందుకంటారు?” అనే డైలాగ్ లోతైన అర్థాన్ని ఇస్తుంది. అలాగే “గర్ల్స్ విషయంలో ఆప్షన్స్ ఉంటాయి, కానీ అమ్మల విషయంలో ఆప్షన్స్ ఉండవు” వంటి రియలిస్టిక్ సంభాషణలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఈ తరం యువతరం రిలేషన్‌షిప్ డైనమిక్స్ (సంబంధాల గతిశీలత)ను ఈ సినిమా బాగా చూపించింది.

నటీనటుల పర్ఫామెన్స్

రిషి పాత్రకు హరీష్ చక్కగా సరిపోయాడు. అతని ఫ్రెష్ లుక్, సహజ నటన యువతరాన్ని ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్ కథలకు కరెక్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. డైలాగ్స్ చెప్పే తీరు బాగుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో నేచురల్ స్టార్ నానిని గుర్తు చేశాడు. అవంతిక , అతుల్య చంద్ర ఇద్దరు హీరోయిన్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సింధు, అన్వి పాత్రల మధ్య ఎమోషనల్ ట్రావెల్‌ను బాగా పోషించారు. కీలకమైన తల్లి పాత్రలో రోహిణి నటన అద్భుతం. ఆమె డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ కన్విక్షన్ సినిమా స్థాయిని పెంచాయి. భద్రం, దినేష్ పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నాయి. దినేష్ పాత్ర పోషించిన నటుడు కామెడీతో నవ్వించాడు.

టెక్నికల్ వ్యాల్యూస్

సినిమాకు ప్రధాన బలం అరీష్ అందించిన సంగీతం. పాటలు, నేపథ్య సంగీతం (BGM) రెండూ కథలోని భావోద్వేగాన్ని బాగా ఎలివేట్ చేశాయి. దర్శకుడు రాసుకున్న మాటలు చాలా సహజంగా, మనకు తెలిసిన విషయాల్లా అనిపించడం అతని రచనా బలమే. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించినా, మొదటి సగంలో ఎడిటింగ్‌లో కొన్ని అనవసరపు సీన్లు, జంప్ కట్స్ లాంటి లోపాలు కనిపించాయి. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి.

ఫైనల్లీ

మరువ తరమా - ఈ తరం ప్రేమ, స్నేహం, త్యాగం, తల్లి అనుబంధం వంటి అంశాలను మిళితం చేసిన ఒక భావోద్వేగపూరిత చిత్రం. కథనం, డైలాగ్స్, ఎమోషనల్ కనెక్టివిటీ బాగున్నాయి. యూత్ ఆడియన్స్‌కు, ఫ్యామిలీతో కలిసి చూడదగిన మంచి లవ్ ఎంటర్‌టైనర్.

రేటింగ్: 3/5

Tags:    

Similar News