Barabar Premistha Review: బరాబర్ ప్రేమిస్తా రివ్యూ.. మెప్పించిన చంద్రహాస్..!
Barabar Premistha Review: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పేరు ఇటీవల ఓ వివాదంతో సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయింది.
Barabar Premistha Review: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పేరు ఇటీవల ఓ వివాదంతో సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయింది. ఆ వివాదం ఎలా మొదలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపత్ రుద్ర దర్శకత్వంలో, కాకర్ల సత్యనారాయణ సమర్పణలో, సిసి క్రియేషన్స్ & ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఈవెంట్‌లో జరిగిన ఘటనతో ఈ కాంట్రవర్సీ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడీ కాంట్రవర్సీ నడుమ చంద్రహాస్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ
బరాబర్ ప్రేమిస్తా కథ రుద్రారం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో కుల, వర్గ విభేదాలు తీవ్రంగా ఉంటాయి. తరచూ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేర్వేరు వర్గాలకు చెందిన చందు (చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
తమ ప్రేమను ఇంట్లోవాళ్లు గానీ, ఊరి పెద్దలు గానీ అంగీకరించరని తెలుసుకున్న ఈ జంట కేరళకు పారిపోతుంది. కానీ అక్కడ కూడా వారికి ప్రశాంతత దక్కదు. చివరికి తిరిగి సొంత ఊరికే వచ్చి, తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఊరిని ఏకం చేసే ప్రయత్నం మొదలుపెడతారు. ఈ ప్రయత్నాల్లో వారు సక్సెస్ అవుతారా? ఊరంతా కలిసి వీరి పెళ్లికి ఒప్పుకుంటుందా? లేదా ప్రేమను విడదీస్తుందా? అన్నది తెరపై చూడాల్సిందే.
నటన
చంద్రహాస్ బయట ఎంత చలాకీగా కనిపిస్తాడో, తెరపైన కూడా అంతే ఎనర్జీతో కనిపించాడు. చందు పాత్రలో తన వయసుకు తగ్గ ఫుల్ యూత్‌ఫుల్ వైబ్‌తో నటించి మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. డ్యాన్స్, యాక్షన్, డైలాగ్ డెలివరీలో గత సినిమాల కంటే మెచ్యూరిటీ కనిపిస్తుంది.
హీరోయిన్‌గా మేఘన ముఖర్జీ తన సహజ నటనతో ఆకట్టుకుంటుంది. అర్జున్ తన పాత్ర పరిధిలో బాగా నటించాడు. మీసాల లక్ష్మణ్ సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌లా నిలిచాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ
దర్శకుడు సంపత్ రుద్ర పాత ప్రేమకథను తీసుకుని, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ముందే ఊహించగలిగే కథ అయినప్పటికీ, రెండున్నర గంటల పాటు ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.
కులాలు, మతాలు ప్రేమకు ఎలా అడ్డుగా మారుతున్నాయి? ఇప్పటికీ సమాజంలో కులవ్యవస్థ ఎంత లోతుగా ఉంది? అనే అంశాలను ఎంటర్టైనింగ్‌గా చూపించడంలో సినిమా విజయవంతమైంది.
ప్రథమార్ధంలో గ్రామం పరిచయం, అక్కడి ప్రజల జీవనశైలి, కుల ఆధిపత్య పోరు, హీరో–హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వచ్చే సీన్లు, ప్రేమ సన్నివేశాలు ఇలా ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ దగ్గర ఓ చిన్న ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో కథ ట్రాక్ ఎక్కుతుంది. తమ ప్రేమ కోసం హీరో–హీరోయిన్ చేసే పోరాటంతో ద్వితీయార్ధం సాఫీగా సాగుతుంది. ప్రీ–క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.
సాంకేతిక అంశాలు
ధృవన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. శేఖర్ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బోర్ లేకుండా సరిగ్గా కట్ చేశారు. డైలాగ్స్, పాటలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టినట్టు ప్రొడక్షన్ వ్యాల్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో పెట్టిన ఖర్చు కనిపించేలా సినిమా ఉంటుంది.
తుది మాట
సరదాగా థియేటర్‌కు వెళ్లి ఓ యూత్‌ఫుల్, కమర్షియల్ లవ్ స్టోరీ చూడాలనుకునే ప్రేక్షకులకు ‘బరాబర్ ప్రేమిస్తా’ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
రేటింగ్: 3/5