Kaantha Movie Review: 'కాంత' రివ్యూ: దుల్కర్, రానా మ్యాజిక్.. పీరియడ్ డ్రామాలో ఉత్కంఠభరితమైన థ్రిల్!
Kaantha Movie Review: 'మహానటి', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మెగాపవర్‌స్టార్ దుల్కర్ సల్మాన్, తన మార్క్‌ని మరోసారి నిరూపించుకునేందుకు 'కాంత' (Kaantha) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పీరియడ్ డ్రామా, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా చిత్రం శుక్రవారం (నవంబర్ 14న) విడుదలైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు సముద్రఖని, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా? కథ, కథనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కథ:
సినిమా కథ 1950ల నాటి మద్రాస్ స్టూడియోల నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ నటుడు టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) మరియు తనను స్టార్‌గా చేసిన దర్శకుడు అయ్యా (సముద్రఖని) మధ్య నడిచే ఈగో క్లాష్‌తో కథ మొదలవుతుంది. మహదేవన్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని, నిజాయితీగా లేడని అయ్యా భావిస్తాడు.
స్టూడియో యజమాని ఒత్తిడితో ఆగిపోయిన 'శాంత' చిత్రాన్ని అయ్యా తిరిగి ప్రారంభిస్తాడు. ఇందులో హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే). అనాథ అయిన కుమారిని అయ్యానే ప్రోత్సహిస్తాడు. సినిమా షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచే, కథానాయిక ప్రాధాన్యత గురించి దర్శకుడు అయ్యా, క్లైమాక్స్ మార్చాలని కోరుకునే హీరో మహదేవన్ మధ్య గొడవలు పెరుగుతాయి. ఈ గందరగోళంలో ఇరుక్కున్న కుమారి, మహదేవన్‌ను ప్రేమిస్తుంది. అప్పటికే పెళ్లయిన మహదేవన్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేస్తుంది, పైగా ఆమె గర్భవతి. చివరకు మహదేవన్ ఒప్పుకున్న మరుసటి రోజు ఉదయం కుమారి శవమై కనిపిస్తుంది.
కుమారిని చంపింది ఎవరు? ఆమె గదిలో దర్శకుడు ఎందుకు ఉన్నాడు? హీరో మామ, స్టూడియో యజమాని, హీరోయిన్ అసిస్టెంట్.. వీరందరికీ కుమారితో ఉన్న సంబంధాలు ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ థ్రిల్లింగ్ మిస్టరీ.
విశ్లేషణ:
'కాంత' కేవలం పీరియడ్ డ్రామాగానే కాకుండా, ఇంటర్వెల్ తర్వాత పక్కా థ్రిల్లర్‌గా మారి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.1950ల నాటి మద్రాస్ స్టూడియోల వాతావరణం, సెట్‌లు, కార్లు, డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా చూపించడంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం అద్భుతం.
నటీనటులు:
దుల్కర్ సల్మాన్ టీకే మహదేవన్‌గా తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. దుల్కర్-సముద్రఖని మధ్య ఫస్టాఫ్‌లో వచ్చే సీన్లు చాలా బలంగా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా రానా దగ్గుబాటి సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చి, తన సీరియస్ రోల్‌తో సినిమాకి ఎనర్జీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. సముద్రఖని తన పాత్రలో లీనమైపోయారు, భాగ్యశ్రీ బోర్సే ఊహించని స్థాయిలో నటించి ఆకట్టుకుంది.
టెక్నికల్ అంశాలు:
జాను చాంతర్ సంగీతం వినసొంపుగా ఉండగా, జేక్స్ బిజోయ్ బీజీఎం థ్రిల్లింగ్ సన్నివేశాలకు హైలైట్‌గా నిలిచింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్‌ను ఇచ్చాయి. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తీసుకున్న కథ, అందులోని లేయర్లు, ఎమోషన్స్, ట్విస్ట్‌లు అన్నీ బాలెన్స్డ్ గా ఉన్నాయి. ఫైనల్ రివీల్ ప్రేక్షకులను చివరి వరకూ పట్టేస్తుంది. మొత్తానికి, 'కాంత' పీరియడ్ డ్రామా, బలమైన నటన, గ్రిప్పింగ్ థ్రిల్లర్ అంశాలు కలగలిసిన ఒక ఆకట్టుకునే సినిమా.
రేటింగ్: 3.25/5