Bhartha Mahasayulaki Wignyapthi Movie Review: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ.. రవితేజ ఈసారి గట్టిగానే నవ్వించాడు..!
Bhartha Mahasayulaki Wignyapthi Movie Review: మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Bhartha Mahasayulaki Wignyapthi Movie Review: మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన చిత్రమే భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ట్రైలర్ నుంచే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా జనవరి 13న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను పలకరించింది.
కథ
రామ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ తయారీ కేంద్రానికి యజమాని. తన బిజినెస్ విస్తరణ కోసం స్పెయిన్ వెళ్లిన రామ్, అక్కడ మానస శెట్టి (ఆశికా రంగనాథ్) అనే బిజినెస్ ఉమెన్‌తో పరిచయం పెంచుకుంటాడు. ఆమెకు తన అసలు పేరు చెప్పకుండా, తన మేనేజర్ విందా అలియాస్ బెల్లం (సత్య) వల్ల జరిగిన ఒక గందరగోళం ద్వారా ఆమెకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో మానసతో ప్రేమలో పడి, ఫిజికల్ రిలేషన్‌లో కూడా ఉంటాడు. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. రామ్‌కు అప్పటికే బాలామణి(డింపుల్ హయతి)తో వివాహం జరిగి ఉంటుంది. తన భార్యకు ఈ విషయం తెలియకుండా రామ్ ఎలా మేనేజ్ చేశాడు? అసలు మానస మళ్లీ ఇండియాకి వచ్చి రామ్ జీవితంలో ఎలాంటి అలజడి సృష్టించింది? చివరికి తన ఇద్దరు ముద్దుల మధ్యన ముక్కున వేలేసుకున్న రామ సత్యనారాయణ ఈ గండం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కథాంశం.
విశ్లేషణ
నిజానికి ఈ సినిమాలో కథ పరంగా చూస్తే చాలా పాత లైన్ కనిపిస్తుంది. ఇద్దరు భార్యలు లేదా ఒక భార్య, ఒక గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే భర్త కథలు మనం గతంలో చాలా చూశాం. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల దీనికి ట్రెండింగ్ మీమ్స్, సోషల్ మీడియా కామెడీని జోడించి కొత్తగా ప్రెజెంట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా రవితేజ, సత్య మధ్య వచ్చే సీన్లు థియేటర్లో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. వెన్నెల కిషోర్ ఎంట్రీతో సెకండ్ హాఫ్ కూడా ఊపందుకుంటుంది. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త హడావుడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. సినిమాలో పెద్దగా ఎమోషన్స్ ఆశించలేము కానీ, కేవలం వినోదం కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా ఒక పక్కా మీల్స్ లాంటిది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
రవితేజ తన ఎనర్జిటిక్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. తన మార్క్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ ఆశికా రంగనాథ్ గ్లామర్ పరంగా మెప్పించగా, డింపుల్ హయతి తన డాన్స్ మరియు నటనతో ఇరగదీసింది. కమెడియన్ సత్య ఈ సినిమాకు అసలైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ప్రతి సీన్‌లోనూ తనదైన శైలిలో నవ్వించాడు. సునీల్ మరియు వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
టెక్నికల్ టీం
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా వామ్మో వాయ్యో సాంగ్ థియేటర్లో ఊపు తెస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. స్పెయిన్ లొకేషన్లను చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్లు కట్ చేసి ఉంటే బాగుండేది. కిషోర్ తిరుమల తన మార్క్ ఫీల్ గుడ్ టచ్‌తో పాటు మాస్ మసాలా కామెడీని కూడా బాగానే మిక్స్ చేశారు.
ప్లస్ పాయింట్లు:
రవితేజ ఎనర్జీ,కామెడీ టైమింగ్.
సత్య, వెన్నెల కిషోర్ అదిరిపోయే కామెడీ.
భీమ్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్.
మైనస్ పాయింట్లు:
పాత కథాంశం (నో లాజిక్స్).
కాస్త నెమ్మదించిన ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్లు.
హడావుడిగా అనిపించే క్లైమాక్స్.
మొత్తానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది ఎలాంటి లాజిక్కులు వెతకకుండా కేవలం నవ్వుకోవడానికి చూసే సినిమా. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయదగ్గ మూవీ. రవితేజ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.
రేటింగ్: 3/5