Laggam Time Review: లగ్గం టైం రివ్యూ: పెళ్లి కొడుకు కిడ్నాప్.. పాత ప్రియుడి ఎంట్రీ.. ఈ 'లగ్గం' నవ్వించిందా?
Laggam Time Review: రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లగ్గం టైం'.
Laggam Time Review: రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లగ్గం టైం'. కిడ్నాప్ డ్రామాకు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 6) విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో విశ్లేషణలో చూద్దాం.
కథ:
అనన్య (నవ్య), చంద్ర (సుదర్శన్)ల పెళ్లి రోజున కథ మొదలవుతుంది. అనన్య మాజీ ప్రియుడు సూర్య (రాజేష్ మేరు) ఎలాగైనా ఆమెను తీసుకువెళ్లాలని తన స్నేహితుడితో కలిసి పెళ్లి ఇంటికి వస్తాడు. అయితే, అక్కడ జరిగిన కొన్ని అనూహ్య ఘటనల వల్ల భయపడి వారు పారిపోయి ఓ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తారు. అదే సమయంలో పెళ్లి కొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఇంటర్వ్యూలో సూర్య తన పాత ప్రేమకథను హెచ్‌ఆర్ (ప్రీతీ సుందర్)కి వివరిస్తుండగా, పోలీసులు వచ్చి చంద్రను కిడ్నాప్ చేసింది సూర్యనే అని అతడిని అరెస్ట్ చేస్తారు. అసలు చంద్రను ఎవరు కిడ్నాప్ చేశారు? సూర్య - అనన్యల పుణే లవ్ స్టోరీ ఏంటి? చివరికి ఈ గందరగోళం ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
పెళ్లి సమయంలో కిడ్నాప్‌లు, పాత ప్రేమకథలు అనేవి రొటీన్ ఫార్ములా అయినప్పటికీ, దర్శకుడు ప్రజోత్ కథనాన్ని కాస్త కొత్తగా నడిపించే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్: సినిమా ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ, కామెడీ ట్రాక్ సరదాగా సాగుతాయి. హీరో తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం, అదే సమయంలో పెళ్లి కొడుకు కిడ్నాప్ అవ్వడం వంటి అంశాలు సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. హీరో లవ్ స్టోరీతో పాటు పెళ్లి కొడుకు లవ్ ట్రాక్‌ను కూడా లింక్ చేయడం ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్: ప్రారంభంలో సుమారు 20 నిమిషాల పాటు పెళ్లి సీన్లను సాగదీసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ హిందీ-తెలుగు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. లవ్ ఫెయిల్యూర్ ఎమోషన్స్ రొటీన్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల కామెడీ కృతజ్ఞకంగా అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు:
హీరో రాజేష్ మేరు తన పాత్రలో ఒదిగిపోయారు. నవ్య చిట్యాల తన క్యూట్ లుక్స్‌తో పాటు నటనతోనూ మెప్పించింది. సుదర్శన్ తన మార్కు కామెడీతో సినిమాకు పిల్లర్‌గా నిలిచారు. ప్రణీత్ రెడ్డి, అరుణ్ కుమార్ అక్కడక్కడా నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు యావరేజ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. దర్శకుడు పాత కథనే కొత్త నెరేషన్‌తో చెప్పడంలో సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
ముగింపు: ఓ మోస్తరు ట్విస్టులు, సరదా కామెడీతో సాగే 'లగ్గం టైం' వీకెండ్‌లో సరదాగా ఒకసారి చూడదగ్గ చిత్రం.
రేటింగ్: 3/5