Heart Health: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు
Symptoms Indicate Heart Problems: ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం, 2019లో సుమారు 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానంలో మార్పుల వరకు అన్ని విషయాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఛాతీలో ఒత్తిడి, నొప్పి, లేదా అసౌకర్యం అనుభవిస్తే ఇది హార్ట్ అటాక్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. ఇక ఛాతి నుండి భుజాలు, చేతులు, వెన్ను, మెడ, దవడ లేదా కడుపు వరకు నొప్పిగా ఉంటున్నా అలర్ట్ అవ్వాలి. ఈ లక్షణం ఎక్కువగా కాలం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, తక్కువ దూరం నడిచినా ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే అకస్మాత్తుగా చల్లటి చెమటలు పడుతున్నా అది హార్ట్ అటాక్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని సూచిస్తున్నారు. నిత్యం వికారం, వాంతులు వచ్చిన భావన కలుగుతుంటే అది కూడా గుండెపోటుకు ముందస్తు లక్షణంగా భావించాలి.
ఇక తీవ్ర తలనొప్పి లేదా తిమ్మిరి అనుభవిస్తే, ఇది హార్ట్ అటాక్‌కు సూచన కావచ్చు. చిన్న చిన్న పనులకే తీవ్రమైన అలసటగా ఉండడం, నాలుగు అడుగులు కూడా వేయలేకపోతే హార్ట్ అటాక్‌కు ప్రాథమిక సంకేతంగా భావించాలి. పైన తెలిపిన ఏ లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటును ముందుగా గుర్తిస్తే చికిత్స కూడా సులభతరం అవుతుంది.