గేదె పాలకంటే బొద్దింక పాలు మంచివా? ఇందులో నిజమెంత?

Update: 2025-02-15 16:32 GMT

గేదె పాలకంటే బొద్దింక పాలు మంచివా? ఇందులో నిజమెంత?

Cockroach milk vs buffalo milk: ఆవు, గేదె, గొర్రె, గాడిద పాలు గురించి విని ఉంటారు కానీ ఎప్పుడైనా బొద్దింక పాలు గురించి విన్నారా? పరిశోధనల ప్రకారం బొద్దింకల పాలలో ఆవు, గేదె పాలకంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాల రూపంలో వచ్చే ఈ ప్రత్యేకమైన స్ఫటిక ప్రోటీన్ శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు కూడా ఇందులో లభిస్తాయి.

పరిశోధనల ప్రకారం, 100 గ్రాముల బొద్దింక పాలు శరీరానికి 232 కేలరీల శక్తిని అందిస్తాయి. అయితే అదే పరిమాణంలోని ఆవు పాలు కేవలం 66 కేలరీల శక్తినే అందిస్తాయి బొద్దింక పాలలో 45% ప్రోటీన్, 25% కార్బోహైడ్రేట్లు, 16-22% కొవ్వు, 5% అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ విషయాన్ని "ఫ్రీ ప్రెస్ జర్నల్'లో ప్రచురించారు. అలాగే బొద్దింక పాలలో ఒలేయిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, షార్ట్-చైన్ వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అత్యవసరమైన ప్రోటీన్‌గా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక చాలా మంది పాలు జీర్ణకాక ఇబ్బంది పడుతున్నారు. లాక్టోస్‌ను జీర్ణం చేసే లాక్టేజ్ ఎంజైమ్ ప్రపంచ జనాభాలో సుమారు 65% మందిలో లేని కారణంగా వారికి పాలు తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. అయితే బొద్దింక పాలలో లాక్టోస్ ఉండదు. అందువల్ల ఇది లాక్టోస్ అసహన సమస్య ఉన్నవారికి ఓ మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బొద్దింకల నుంచి పాలు సేకరించడం అంత తేలికైన పని కాదు.

ఈ ప్రత్యేకమైన పాల సరఫరా బొద్దింకల పేగుల్లో ఉండే పదార్థాన్ని సేకరించడంపై ఆధారపడి ఉంటుంది. 100 గ్రాముల బొద్దింక పాలను సేకరించేందుకు సుమారు 1000 ఆడ బొద్దింకలను చంపాల్సి వస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మార్కెట్లో బొద్దింక పాలు విక్రయిస్తున్నారన్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. అలాగే సంప్రదాయ పాలను ఈ బొద్దింక పాలు ఎంత వరకు రిప్లేస్‌ చేస్తాయనేది చూడాలి. 

Tags:    

Similar News