Instant Bloating Relief: కడుపు ఉబ్బరానికి తక్షణ ఉపశమనం.. 4 పదార్థాలతో అద్భుతమైన హోం రెమెడీ రెడీ
Instant Bloating Relief: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో జీర్ణక్రియ సమస్యలు ప్రధానమైనవి.
Instant Bloating Relief: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో జీర్ణక్రియ సమస్యలు ప్రధానమైనవి. అందులోనూ కడుపు ఉబ్బరం చాలా మందిలో సాధారణమైపోయింది. కొన్నిసార్లు ఈ సమస్య ఎంత తీవ్రమవుతుందంటే, దాని వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దీనికోసం వివిధ రకాల మందులు వాడుతున్నప్పటికీ, కొన్ని సులభమైన ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణురాలు నేహా సహాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఆధారంగా కేవలం 5 నిమిషాల్లో కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఆ సహజ పానీయం గురించి తెలుసుకుందాం.
భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా లేదా బిగుతుగా అనిపించడం సర్వసాధారణంగా జరిగే సమస్యే. అయితే, కేవలం నాలుగు ఇంట్లో దొరికే పదార్థాల సహాయంతో ఈ ఉబ్బరాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. దీని తయారీకి కావలసినవి.. 1-2 టీస్పూన్ల పంచదార (లేదా బెల్లం), ఒక చిన్న అల్లం ముక్క, 4-5 పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం. ఈ పదార్థాలన్నింటినీ తీసుకుని, ఒక గ్లాసు వేడి నీళ్లలో వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని 5 నిమిషాల పాటు మూతపెట్టి ఉంచి, అందులో ఉన్న పోషకాలు, రుచి నీటిలోకి చేరేలా చూడాలి. అనంతరం ఈ నీటిని వడకట్టి అది మరీ వేడిగా లేకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మెల్లగా తాగాలి. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
ఈ పానీయంలో ఉండే నాలుగు పదార్థాలు శరీరంలోని గ్యాస్‌ను సులభంగా బయటకు పంపడానికి అద్భుతంగా సహాయపడతాయి. ప్రతి పదార్థం జీర్ణక్రియకు ప్రత్యేకంగా తోడ్పడుతుంది.. అల్లం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసి, గుండెల్లో మంట సమస్యను తగ్గిస్తుంది. పుదీనా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, జీర్ణ సంబంధిత సమస్యలను సమర్థవంతంగా తొలగిస్తుంది. నిమ్మరసం శరీరంలోని అధిక సోడియం, హానికరమైన అంశాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఈ పదార్థాలను గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ వేగం మరింత పెరుగుతుంది, తద్వారా కడుపు ఉబ్బరం త్వరగా తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఈ సహజ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం సహా ఇతర జీర్ణ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.