Health: జంక్‌ ఫుడ్‌కు, మెదడు ఆరోగ్యానికి సంబంధం ఏంటి.?

Health: చిన్నారుల నుంచి పెద్దల వరకు జంక్‌ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిజ్జా, బర్గర్లను లొట్టలేసుకుని తింటారు.

Update: 2025-03-02 10:34 GMT

Health: జంక్‌ ఫుడ్‌కు, మెదడు ఆరోగ్యానికి సంబంధం ఏంటి.?

Health: చిన్నారుల నుంచి పెద్దల వరకు జంక్‌ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిజ్జా, బర్గర్లను లొట్టలేసుకుని తింటారు. అయితే జంక్‌ ఫుడ్‌ వల్ల కేవలం శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ జంక్‌ ఫుడ్‌ వల్ల మెదడు పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.? తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంక్‌ ఫుడ్‌ మెదడుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

అమెరికన్ అల్జీమర్స్ అసోసియేషన్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం చిత్తవైకల్యాన్ని పెంచే ప్రమాదం ఉంది. ఈ సమస్య జ్ఞాపకశక్తి, భాషా సామర్థ్యం, తార్కికతను ప్రభావితం చేస్తుంది. ఇక జంక్ ఫుడ్ మెదడుపై చూపే ప్రతికూల ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* జంక్ ఫుడ్ గుండె ఆరోగ్యానికి హానికరమే కాకుండా, మెదడుపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, అధిక చక్కెర జ్ఞాపకశక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా చిత్తవైకల్యం వంటి సమస్యలు రావచ్చు.

* అధిక కొవ్వు, చక్కెరలతో కూడిన ఆహారం హిప్పోకాంపస్ అనే మెదడు భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, అభ్యాసానికి ముఖ్యమైన భాగం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల న్యూరాన్లకు నష్టం వాటిల్లుతుంది.

* మెదడులో సందేశాలను రవాణా చేసే న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యత జంక్ ఫుడ్ వల్ల చెదిరిపోవచ్చు. ఇది డోపమైన్ స్థాయిని పెంచి, మనసులో ఆహారంపై ఎక్కువ ఆకర్షణ కలిగించేలా చేస్తుంది. దీని ప్రభావం వల్ల, అదుపుతప్పి మరింత జంక్ ఫుడ్ తినే అలవాటు ఏర్పడుతుంది.

* పోషకాహార లోపం, అధిక క్యాలరీలు ఉన్న ఆహారం నిరాశ, ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్, అధిక చక్కెరల వల్ల మెదడులో వాపు ఏర్పడే అవకాశముంది, ఇది మానసిక స్థితిని దెబ్బతీస్తుంది.

* జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కోపం, చిరాకు, సోమరితనం పెరిగే అవకాశముంది. దీనిలో ఉండే రసాయనాలు భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాలను ప్రభావితం చేస్తాయి.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి. 

Tags:    

Similar News