Egg Cancer Rumors : కోడిగుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత ?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కోడిగుడ్లు తింటే క్యాన్సర్ వస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారంపై భారతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గట్టి క్లారిటీ ఇచ్చింది.

Update: 2025-12-21 13:00 GMT

Egg Cancer Rumors : కోడిగుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత ?

Egg Cancer Rumors : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కోడిగుడ్లు తింటే క్యాన్సర్ వస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారంపై భారతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కొట్టిపారేసింది. మన దేశంలో లభించే కోడిగుడ్లు తినడానికి పూర్తిగా సురక్షితమైనవని, జనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అసలు ఈ గందరగోళం ఎక్కడి నుంచి మొదలైందంటే.. ఎగ్గోజ్ న్యూట్రిషన్ అనే కంపెనీకి చెందిన గుడ్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయంటూ ఇంటర్నెట్‌లో విపరీతంగా వార్తలు వచ్చాయి. ఇది చూసిన సామాన్యులు గుడ్లు కొనాలంటేనే భయపడిపోయారు. దీనిపై శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసిన FSSAI, ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తున్నాయని మండిపడింది. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి శాస్త్రీయ ఆధారం లేని వార్తలను నమ్మవద్దని కోరింది.

కోడిగుడ్ల ఉత్పత్తిలో పౌల్ట్రీ యజమానులు అనుసరించాల్సిన నిబంధనల గురించి కూడా అధికారులు వివరించారు. ఆహార భద్రత, ప్రమాణాల నియమావళి 2011 ప్రకారం.. కోళ్ల పెంపకంలో గానీ, గుడ్ల ఉత్పత్తిలో గానీ నైట్రోఫ్యూరాన్ అనే రసాయనాలను వాడటంపై కఠినమైన నిషేధం ఉంది. ఇవి క్యాన్సర్‌కు కారణమవుతాయని తేలడంతో ఎప్పుడో వీటిని బ్యాన్ చేశారు. కాబట్టి మార్కెట్లో దొరికే గుడ్లలో ఇలాంటి ప్రమాదకరమైన అంశాలు ఉండే ప్రసక్తే లేదని FSSAI అధికారి ఒకరు వెల్లడించారు.

కేవలం ఒకటో రెండో ప్రయోగశాలల రిపోర్టులను పట్టుకుని గుడ్లు అసురక్షితమని చెప్పడం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదని సంస్థ పునరుద్ఘాటించింది. కోడిగుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఒక అద్భుతమైన పోషకాహారమని, సమతుల ఆహారంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. నిబంధనల ప్రకారం ఉత్పత్తి చేసిన గుడ్లను ఎవరైనా నిరభ్యంతరంగా తినవచ్చని, పుకార్లను నమ్మి పౌష్టికాహారానికి దూరం కావద్దని సూచించింది.

Tags:    

Similar News