HIVకి వ్యాక్సిన్ తొలి ట్రయల్ సక్సెస్.. mRNA టెక్నాలజీతో సరికొత్త ఆశలు!
HIV వంటి ప్రాణాంతక వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఈ దిశలో ఇప్పుడు ఒక కొత్త ఆశ చిగురించింది.
HIV వంటి ప్రాణాంతక వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఈ దిశలో ఇప్పుడు ఒక కొత్త ఆశ చిగురించింది. ఇటీవల అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త HIV వ్యాక్సిన్‌ను పరీక్షించారు. ఈ ట్రయల్‌లో 108 మంది ఆరోగ్యవంతులకు ఈ టీకా ఇచ్చి, వారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశీలించారు. ఈ టీకాను mRNA టెక్నాలజీతో తయారు చేశారు. ఇదే టెక్నాలజీతో కోవిడ్-19 వ్యాక్సిన్‌లను కూడా తయారు చేశారు.
HIV వైరస్ చాలా వేగంగా తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే ఒక సాధారణ యాంటీబాడీ ఈ వైరస్‌ను గుర్తించలేదు. ఈ సమయంలో బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ (bnAb) చాలా అవసరం. సాధారణ భాషలో చెప్పాలంటే, మన శరీరంలోకి ఒక వైరస్ ప్రవేశించినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కానీ HIV వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ దానిని గుర్తించలేదు. కానీ bnAb యాంటీబాడీలు HIV వైరస్ విభిన్న రూపాలను గుర్తించి, వాటిని నాశనం చేయగలవు.
మొదటి దశ ట్రయల్‌లో కొన్ని సానుకూల అంశాలు, కొన్ని సవాళ్లు బయటపడ్డాయి. mRNA-నానోపార్టికల్ వ్యాక్సిన్‌ను తీసుకున్న వారిలో 80% మందిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. ఈ టీకా రోగనిరోధక జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. అయితే, కొంతమందిలో చర్మంపై రియాక్షన్స్ కనిపించాయి. అవి పెద్ద సమస్య కానప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిపై మరింత పరిశోధనలు చేయాలని నిర్ణయించారు.
ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి? శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంత కాలం పనిచేస్తాయి? బూస్టర్ డోసులు అవసరమా? అదనంగా బూస్టర్ డోసులు తీసుకోవాల్సి వస్తుందా? ఇప్పటికే సోకిన వారిపై పని చేస్తుందా? ఇప్పటికే HIV సోకిన వారిపై ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా, లేదా ముందు జాగ్రత్తగా మాత్రమే తీసుకోవాలా?
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్‌లో ఉంది. ఇందులో వ్యాక్సిన్ ఎంత సురక్షితమైనదో తెలుసుకుంటారు. రియల్ ఫలితాలు ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్‌లో తెలుస్తాయి. చాన్స్ఇన్స్, మోడెర్నా వంటి కంపెనీలు తదుపరి దశలకు సిద్ధమవుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఒక సమర్థవంతమైన HIV వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ mRNA టెక్నాలజీ HIV వంటి ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడానికి సరైన మార్గం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.